: నందమూరి వంశానికి ఎదురు వెళ్లే ధైర్యం ఎవరికి ఉంది?: పల్లె రఘునాథరెడ్డి
నందమూరి వంశానికి ఎవరూ ఎదురు వెళ్లలేరని, అంత ధైర్యం ఎవరికైనా ఉందా? అని ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రశ్నించారు. హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’కి వంద శాతం వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని ఎవరైనా వ్యతిరేకించారా? అని మీడియా ప్రశ్నించగా, పల్లె పై విధంగా సమాధానమిచ్చారు.
ఈ సందర్భంగా ‘రుద్రమదేవి’ చిత్రానికి వినోదపు పన్ను ఎందుకు మినహాయించలేదనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ విషయమై ‘రుద్రమదేవి’ చిత్ర బృందం చేసిన దరఖాస్తు తమకు ఆలస్యంగా అందిందని, అందుకే, ఆ రాయితీ కల్పించలేకపోయామని చెప్పారు. కాగా,‘గౌతమి పుత్ర శాతకర్ణి’కి పన్ను రాయితీ కల్పించే విషయమై కేబినెట్ లో చర్చ జరుగుతున్న సమయంలో తాను ఉండనంటూ సీఎం చంద్రబాబు బయటకు వెళ్లిపోవడం తెలిసిందే. బాలకృష్ణ తనకు బంధువు అని, ఈ చర్చపై తన ప్రభావం పడకుండా ఉండేందుకే తాను బయటకు వెళుతున్నానని చెప్పిన చంద్రబాబు, సమావేశ బాధ్యతలను మంత్రి యనమల రామకృష్ణుడుకు అప్పగించారు.