: తోపుడు బండిపైన అమ్మే చాట్ తిని బాలిక మృతి.. 27 మందికి అస్వస్థత
ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి జిల్లాలోని ఓ గ్రామంలో తోపుడు బండిపైన అమ్మే చాట్ తిని 14 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో మరో 27 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వారిలో అధిక శాతం మంది చిన్నారులే ఉండడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చికిత్స తీసుకుంటున్న వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విషపూరిత ఆహారం తీసుకోవడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని, మృతి చెందిన బాలిక పేరు పూనమ్ అని తెలిపారు.
వైద్య నివేదిక ఆధారంగా తోపుడు బండి వ్యాపారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పూనమ్‌ను దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు చికిత్స అందించి, అనంతరం ఇంటికి పంపారని పోలీసులు తెలిపారు. అయితే, ఇంటికి చేరుకున్న వెంటనే ఆ బాలిక పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయిందని చెప్పారు.
కాగా, ఆమె మృతిపై ఆ బాలిక తండ్రి కిషోరీ లాల్ వాదన మరోలా ఉంది. తన కుమార్తె ఆ చాట్ కారణంగా మృతి చెందలేదని, చాట్ తినని చిన్నారులు కూడా అస్వస్థతకు గురయ్యారని అంటున్నాడు. తమ గ్రామంలో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని, అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పలువురు అధికారులు ఆ గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు.