: జనం ఎక్కువ మంది ఉండడంతో ఊపిరి ఆడక నా కుమారుడు కుప్పకూలాడు.. షారుఖ్ ఖాన్ ని ఏమీ అనకండి: ఫరీద్ ఖాన్ తల్లి
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన ‘రయీస్’ సినిమా ప్రచారంలో భాగంగా నిర్వహిస్తోన్న ‘రయీస్ బై రైల్’ (ముంబై నుంచి ఢిల్లీకి) కార్యక్రమంలో వడోదర రైల్వేస్టేషన్ లో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రైలులో ఉన్న షారుఖ్‌ని చూసేందుకు అభిమానులు ఎగబడడంతో తొక్కిసలాట జరిగి ఫరీద్ ఖాన్ పఠాన్ అనే యువకుడు మృతి చెందాడు. దీనిపై ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. షారుఖ్ ఖాన్ పై తమకు ఎటువంటి కోపం లేదని, ఫరీద్ ఖాన్ చనిపోయింది సినిమా ప్రచార కార్యక్రమం కారణంగా కాదని తెలిపారు. జరిగిన దాంట్లో షారుక్ తప్పు ఏమీ లేదని, అతడు తనకు కొడుకు లాంటివాడని ఫరీద్ ఖాన్ తల్లి తెలిపారు.
తన కుమారుడి అంత్యక్రియలకు సాయం చేసినందుకు షారూఖ్ కు కృతజ్ఞతలు చెబుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. జనం ఎక్కువ మంది ఉండడంతో ఊపిరి ఆడక తన కుమారుడు కుప్పకూలాడని, ఆ సమయంలో తామంతా తమ కుమారుడి కోసం ప్రార్థించామని చెప్పారు. షారూఖ్ పై పలువురు చేస్తోన్న దుష్ప్రచారం మానుకోవాలని ఫరీద్ మేనకోడలు సమినా షేక్ వ్యాఖ్యానించారు. సదరు హీరోను నిందించడం వల్ల తమ ఫరీద్ తిరిగిరాడని అన్నారు. ఇదో దురదృష్టకర ఘటన అని ఫరీద్ అంత్యక్రియలకు వెళ్లడానికి తనకు, తన అమ్మకు ఆ చిత్ర బృందం ఎంతోగానే సహాయపడిందని ఆమె చెప్పారు.