: హోదా లాభమంతా ప్యాకేజీలో ఉందా? ఏది... ఎక్కడ?: చంద్రబాబుకు జగన్ సూటి ప్రశ్న


రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయో, అవన్నీ ప్యాకేజీలో భాగంగా అందుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం విడ్డూరంగా ఉందని వైకాపా అధినేత జగన్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, హోదాకు సమానమైన లాభం ప్యాకేజీలో ఉంటే, అది ఏ రూపంలో ఉందో చూపాలని సవాల్ విసిరారు. హోదాను తాము అడగటం లేదని, హోదాలోని అన్ని అంశాలూ ప్యాకేజీలో అందాయని సాక్ష్యాత్తూ చంద్రబాబే పచ్చి అబద్ధాలు చెబుతున్నారని నిప్పులు చెరిగారు.

ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే లభించే పారిశ్రామిక పన్ను రాయితీల వల్ల దక్కాల్సిన లాభం ఎక్కడుందని ప్రశ్నించారు. 100 శాతం ఇన్ కంటాక్స్, ఎక్సైజ్ రాయితీల తోనే కొత్త పరిశ్రమల రాకకు మార్గం సుగమమవుతుందన్న సంగతి తెలియదా? అని అడిగారు. విషయమంతా ముఖ్యమంత్రికి తెలుసునని, ప్యాకేజీలతో పరిశ్రమలు రావని తెలిసి కూడా ఆయన తన స్వప్రయోజనాలకే పాకులాడుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన మాటల వీడియోను వినిపించారు.

రాయితీల విషయంలో కేంద్రం మొండి చెయ్యి చూపిస్తున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ ఆయన మరచిపోయారని విమర్శించారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ కూడా పూర్తి కాలేదని, ఇంటింటికీ ఉద్యోగం ఇస్తానని చెప్పిన హామీ ఏమైందని, నిరుద్యోగ భృతి విషయం ఎంతవరకూ వచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. హక్కుల సాధన కోసం తాను పోరాటం చేయకపోగా, పోరాటం చేసేందుకు వస్తున్న వారిని తన అధికార బలంతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు.

  • Loading...

More Telugu News