: జల్లికట్టు ఉద్యమం వెనక శశికళ?.. ఉద్యమకారులకు సహకారం.. క్రెడిట్ కోసం వ్యూహ రచన!
జల్లికట్టు కోసం తమిళనాడులో జరిగిన ఉద్యమం వెనక అన్నాడీఎంకే చీఫ్ శశికళ పాత్ర ఉందా? అవుననే అంటున్నారు విశ్లేషకులు. తొలుత చిన్నగా ప్రారంభమైన విద్యార్థుల ఉద్యమం క్రమంగా పుంజుకోవడానికి 'చిన్నమ్మ' సహకారమే కారణమని చెబుతున్నారు. ప్రధాని మోదీపై ఉన్న ఆగ్రహం, జల్లికట్టు సాధించుకోవాలన్న కసితోనే ఆమె సహకారం అందించారని అంటున్నారు.
అంతేకాదు, ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్లడంలోనూ ఆమె పాత్ర ఉందంటున్నారు. ఉద్యమం ఉవ్వెత్తున పైకెగసిన తర్వాత శశికళ స్వయంగా రంగంలోకి దిగి ఆందోళనను విరమింపజేసి ఆ క్రెడిట్‌ను తాను కొట్టేయాలని శశికళ భావించినట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అంతేకాదు ఉద్యమకారులకు నీళ్లు, ఆహారం అందించింది కూడా శశికళ వర్గీయులేనని అంటున్నారు.
అయితే ఆందోళనకారుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో పరిస్థితి శశికళ చేయి దాటిపోయింది. జల్లికట్టు క్రీడ నిర్వహణకు వీలుగా ఆర్డినెన్స్ తీసుకొచ్చాం కాబట్టి ఆందోళనను విరమించాలంటూ ఆమె పంపిన సందేశాన్ని నిరసనకారులు పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహంచిన శశికళ, అప్పటి వరకు వారికి అందించిన అన్నపానీయాల సరఫరాను నిలిపివేశారని విశ్లేషకులు చెబుతున్నారు.