: అవమానాన్ని అధిగమించి... టీమిండియాలో స్థానం సంపాదించిన కశ్మీర్ కుర్రాడు!


ఇంగ్లండ్‌ తో గురువారం నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌ కు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ స్థానాల్లో అమిత్ మిశ్రా, పర్వేజ్ రసూల్ ఎంపికైన సంగతి తెలిసిందే. పర్వేజ్ రసూల్ ఆత్మస్థైర్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే పర్వేజ్ రసూల్ జమ్మూ కశ్మీర్ నుంచి టీమిండియాకు ఎంపికైన ఏకైక ఆటగాడు. జింబాబ్వే సిరీస్ లో భారత్ తరుపున ఏకైక వన్డే ఆడాడు. అయితే గతంలో అతని జీవితంలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. గతంలో సీకె నాయుడు ట్రోఫీలో భాగంగా కర్ణాటక జట్టుపై బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌‌ ఆడేందుకు పర్వేజ్ వెళ్లాడు.

 ఆ సమయంలో స్టీడియంలోకి సరిగ్గా ఎంటర్ అయ్యేముందు భద్రతా సిబ్బంది అతనిని ఆపారు. అతని క్రికెట్ కిట్ బ్యాగ్‌ లో పేలుడు పదార్థాలు ఉన్నాయని అనుమానిస్తూ తనిఖీలు చేశారు. అయితే వారి తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు. దీంతో అతనిని పంపేశారు. ఇంత అవమానం మరెవరికైనా జరిగిఉంటే ఎలా ఉండేదో కానీ, రసూల్ లో మాత్రం పట్టుదల పెరిగింది. ఆ రోజు మ్యాచ్‌ లో కసిగా ఆడి, 69 పరుగులు చేసి సత్తా చాటాడు. తరువాత 2012-13 సీజన్‌ లో జమ్మూ కశ్మీర్ జట్టులో ఆల్‌ రౌండర్‌ గా రాణించాడు. 594 పరుగులతో టాప్ స్కోరర్‌ గా నిలుస్తూ, 33 వికెట్లు తీశాడు. మళ్లీ ఆ వెంటనే జరిగిన రంజీ సీజన్‌ లో 663 పరుగులతో పాటు 27 వికెట్లు తీశాడు. దీంతో టీమిండియా అవకాశం అతని తలుపుతట్టింది. దీంతో పర్వేజ్ రసూల్ గ్రామంలో సంబరాలు జరుపుకుంటున్నారు.

  • Loading...

More Telugu News