: ప్రపంచ రికార్డులు నమోదు చేసిన వన్డే సిరీస్!
భారత పర్యటన సందర్భంగా ఇంగ్లండ్ జట్టు ప్రదర్శించిన పోరాట పటిమ ఆ జట్టుకు కూడా ప్రపంచ రికార్డుల్లో స్థానం కల్పించింది. భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్ లో పరుగుల వరద పారిన సంగతి తెలిసిందే. మూడు వన్డేల్లో రెండు జట్లు ఆరు ఇన్నింగ్స్ లు ఆడగా, ఈ రెండు జట్లు బ్యాటింగ్ కు దిగిన ప్రతిసారీ 300 పైచిలుకు పరుగులు సాధించడం విశేషం. దీంతో ఆరు ఇన్నింగ్స్ లలో రెండు జట్లు కలిపి మొత్తం 2090 పరుగులు చేశాయి. ఇది ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ పరుగుల రికార్డు.
2007లో సౌతాఫ్రికా, భారత్ జట్లు చేసిన 1892 పరుగులే అత్యుత్తమం, ఆ తరువాత అవే జట్ల మధ్య 2009-10లో జరిగిన సిరీస్ లో 1884 పరుగులు నమోదయ్యాయి. తాజా సిరీస్ తో భారత్-ఆఫ్రికా జట్లు రెండు సార్లు నెలకొల్పిన అత్యధికర పరుగుల రికార్డును, భారత్-ఇంగ్లండ్ జట్లు అధిగమించాయి. అంతే కాకుండా కేదార్ జాదవ్ ఈ సిరీస్ లో 144.09 స్ట్రైక్ రేట్ తో, 77.33 సగటుతో 232 పరుగులు చేసి, అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఒక సిరీస్ లో 150 కు పైగా బంతులు ఆడిన భారత్ ఆటగాళ్ల పరంగా ఇది మూడో అత్యుత్తమ స్ట్రైక్ రేట్. గతంలో వీరేంద్ర సెహ్వాగ్ (150.25), రోహిత్ శర్మ(147.56)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.