: మహిళను ఢీ కొట్టి.. ఈడ్చుకుంటూ వెళ్లిన ఆటో!
హైదరాబాద్ లోని అత్తాపూర్ లో దారుణం జరిగింది. అత్తాపూర్ రోడ్డు కూడలిలో నిలబడి ఉన్న మహిళను ఒక ఆటో ఢీ కొట్టింది. దీంతో, ఆగ్రహించిన బాధితురాలు డ్రైవర్ కు బుద్ధి చెప్పాలనుకుని, ఆటోను ఆపే ప్రయత్నంలో దాని రాడ్ ను గట్టిగా పట్టుకుంది. ఈ క్రమంలో అక్కడి నుంచి తప్పించుకు పోయేందుకు ప్రయత్నించిన డ్రైవర్, తన ఆటో స్పీడ్ పెంచాడు. దీంతో, ఆ మహిళను ఈడ్చుకుంటూ సుమారు రెండు వందల మీటర్ల దూరం ఆటో వెళ్లింది. చివరకు, కిందపడిపోయి గాయపడ్డ ఆ మహిళకు పాదచారులు సపర్యలు చేసి, సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆ ఆటో కు నంబర్ ప్లేట్ లేదు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరా ఫుటేజ్ లో ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలకు చేరడంతో వైరల్ గా మారింది.