: అప్పటి నుంచి షారూక్ కు ఎదురు చెప్పలేదు: ‘పాక్’ నటి మహీరా ఖాన్
బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ నటించిన ‘రయీస్’ ఈ నెల 25న విడుదల కానుంది. ఈ చిత్రం ద్వారా పాకిస్థాన్ నటి మహీరా ఖాన్ బాలీవుడ్ కు పరిచయం అవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్ నిమిత్తం దుబాయ్ లో బిజీగా ఉన్న ఆమె, షారూక్ తో కలిసి పనిచేసిన అనుభవం ఎలా ఉందో చెప్పుకొచ్చింది. ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్నపుడు ఎలా నటించాలనే విషయమై షారూక్ తనకు తరచుగా చెబుతుండేవారని చెప్పింది. అయితే, షారూక్ అదే పనిగా చెబుతుండటంతో, ‘నేను సరిగా చేయడం లేదా? అంటూ ఓసారి ఆయన్ని అడిగేశానని చెప్పింది.
‘నా అనుభవంతో నాకు తెలిసింది చెప్పాను. నీకు నచ్చినట్టు నువ్వు చేయొచ్చు. కాకపోతే, తెరపై ఈ సన్నివేశం చూసిన తర్వాత.. ముందే ఎందుకు చెప్పలేదని మాత్రం నన్ను అడగొద్దు’ అని షారూక్ బదులివ్వడంతో, అప్పటి నుంచి ఆయనకు ఎదురు చెప్పలేదంటూ మహీరా ఖాన్ గుర్తు చేసుకుంది. షారూక్ తో కలిసి పనిచేయడంతో చాలా విషయాలు తెలుసుకున్నానని, అందరితో కలిసిపోయే ఆయన, చాలా తెలివైన వాడు అని మహీరా కితాబ్ ఇచ్చింది.