: ఆందోళనకారులపై ట్రంప్ ఉక్కుపాదం.. కేసులు మోపి పదేళ్లు జైలుకు పంపించే యోచన!
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన వేళా విశేషం ఏంటో కానీ, ఆయన తమకు వద్దంటే వద్దని పలువురు అమెరికన్లు రోడ్డెక్కారు. మహిళలు సైతం లక్షలాదిగా వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. దీనిని తీవ్రంగా పరిగణిస్తున్న అధ్యక్షుడు ట్రంప్ నిరసనకారులపై ఉక్కుపాదం మోపాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆందోళనకారులపై తీవ్రమైన అభియోగాలతో కేసులు నమోదు చేసి జైలుకు పంపించేందుకు సిద్ధమవుతున్నారు.
ట్రంప్ ప్రమాణ స్వీకారం రోజు నిరసన తెలిపిన 230 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై హింసాత్మక ఆందోళన (ఫెలోనీ రాయింటింగ్) కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని జైలుకు పంపారు. వీరిందరికీ పదేళ్ల జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు అధ్యక్షుడికి వ్యతిరేకంగా తప్పుడు వార్తలు ప్రచురిస్తున్న మీడియా తన వైఖరి మార్చుకోకపోతే దానితో ఉన్న సంబంధాలపై పునరాలోచించుకోవాల్సి వస్తుందని వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రీన్స్ ప్రీబస్ హెచ్చరించారు.