: కట్టలు తెంచుకున్న ఆవేశం.. విధ్వంసాలకు పాల్పడుతున్న జల్లికట్టు ఆందోళనకారులు
జల్లికట్టు కోసం పట్టుబడుతున్న తమిళనాడు ఆందోళనకారులు దాదాపు ఆరు రోజులుగా చెన్నయ్ మెరీనా బీచ్ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపిన విషయం తెలిసిందే. అయితే, ఈ రోజు తమిళ యువతను పోలీసులు చెదరగొట్టి మెరీనా బీచ్ ని ఖాళీ చేయించడంతో తమిళులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పోరాటాన్ని హింసాత్మకంగా మార్చేశారు. పోలీసుల చర్యలపై తీవ్రంగా మండిపడుతూ వారిపై రాళ్లు రువ్వారు. మెరీన్ బీచ్ సమీపంలో ఉన్న ఐస్ హౌజ్ పోలీస్ స్టేషన్ ముందు ఉన్న పలు పోలీసు, ప్రైవేటు వాహనాలను తగులబెట్టారు. కొందరు ఆందోళన కారులు పెట్రోల్ బాంబులను విసిరినట్లు తెలుస్తోంది. కొందరు యువత ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తున్నారు. ఆందోళన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.
పోలీస్ స్టేషన్ ముందు చెలరేగుతున్న మంటలను పోలీసులు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో వందల సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. చెన్నయ్ తో పాటు మధురైలో కూడా పోలీసులపై ఆందోళనకారులు విరుచుకుపడుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి తమ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు.