: జల్లికట్టు జగడంలో కొత్త ట్విస్ట్... విద్రోహ శక్తులు చేరాయంటున్న సర్కార్... మెరీనాను వీడాల్సిందేనని స్పష్టీకరణ


తమిళ సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు శాశ్వత పరిష్కారం కావాలంటూ ఉద్యమించి, గత ఐదు రోజులుగా మెరీనా బీచ్ లో తిష్ట వేసిన లక్షలాది మంది తమిళ యువతను అక్కడి నుంచి తరిమికొట్టేందుకు తమిళ సర్కారు ఈ ఉదయం చర్యలు చేపట్టింది. బీచ్ వ‌ద్ద ఆందోళ‌న చేస్తున్న విద్యార్థుల‌ను పోలీసులు బ‌ల‌వంతంగా ఖాళీ చేయిస్తుండటంతో ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆర్డినెన్స్ వచ్చింది కాబట్టి, యువత ఎవరి ప్రాంతానికి వారు వెళ్లి జల్లికట్టును ఆనందంగా జరుపుకోవాలని, మెరీనా తీరాన్ని ఖాళీ చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. విద్యార్థుల ముసుగులో సంఘ విద్రోహ శక్తులు చేరినట్టు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం వచ్చిందని, ఈ నేపథ్యంలోనే వారిని అక్కడి నుంచి పంపేందుకు చర్యలు చేపట్టామని, ఎవరిపైనా లాఠీ చార్జ్ వద్దని పోలీసులకు స్పష్టంగా చెప్పామని పన్నీర్ సెల్వమ్ తెలిపారు.

 ఏదైనా జరగకూడనిది జరిగితే నష్టపోయేది తమిళ యువతేనని, జల్లికట్టు విషయంలో ప్రభుత్వం పూర్తి సానుకూలతతో ఉందని అన్నారు. యువత మెరీనా బీచ్ ని వీడాలని కోరారు. కాగా, పెద్దఎత్తున గుమికూడిన యువతను చెల్లాచెదురు చేసే క్రమంలో పోలీసులు లాఠీచార్జ్, బాష్పవాయు గోళాలను ప్రయోగించడంతో పెద్దఎత్తున నినాదాలు చేశారు. తాము సంయమనంతో శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే, పోలీసులు విరుచుకుపడుతున్నారని పలువురు ఆరోపించారు.

  • Loading...

More Telugu News