: నిశీధిలో పెను విషాదం... 30కి పెరిగిన మృతుల సంఖ్య
గత రాత్రి విజయనగరం జిల్లాలో పట్టాలు తప్పిన హీరాకుండ్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య పెరుగుతోంది. ఈ ఘటనలో 30 మంది మరణించినట్టు అడిషనల్ డీజీ అనిల్ సక్సేనా మీడియాకు వెల్లడించారు. సహాయక చర్యలు చురుకుగా సాగుతున్నాయని తెలిపారు. మృతుల్లో చినకుదుమ గ్రామానికి చెందిన మిర్యాల కృష్ణ, పాతర్లపల్లి శ్రీను, పాతర్లపల్లి పోలిశెట్టిలను గుర్తించామని చెప్పారు. క్షతగాత్రుల్లో వసంతకుమార్ మహంతి, అశ్రినాయుడు, ఆర్ శ్రీనివాసరావు, ఎస్పీ ఠాకూర్, తేజస్విని, నిరుపమ, ముకుందా కాశి, కల్యాణ్ సింగ్, జ్యోత్సాబాయి, డోలినాయక్, సుర్జిత్ నాయక్, కుమార్ మహంతి, లీసా సాహు, దుర్గాప్రసాద్ పండా, సాయి సుచిత్రా మోహర్, కుమారి పుల్లై తదితరులు ఉన్నారు. మరింత మంది గాయపడిన వారి వివరాలు తెలియాల్సి వుంది. ఘటనలో 50 మందికి పైగా గాయపడగా, వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వీరిని మెరుగైన చికిత్స కోసం విశాఖకు తరలించారు.