: అగ్నికి ఆజ్యం పోసిన జల్లికట్టు... తమిళనాడు బాటలోనే పలు రాష్ట్రాలు!
తమ సంప్రదాయ క్రీడ జల్లికట్టును కొనసాగించేందుకు తమిళులు చేస్తున్న పోరాటం అనేక మందిలో స్ఫూర్తిని రగిలించింది. రాబోయే రోజుల్లో అనేక ఉద్యమాలకు ఇది నాంది పలికింది. ఎడ్లబండి పోటీల కోసం తాము కూడా ఆందోళన చేస్తామని శివసేన ప్రకటించింది. 2014లో ఎడ్లబండి పోటీలను సుప్రీంకోర్టు నిషేధించింది. గణేష్ చతుర్థి సందర్బంగా గత 30 ఏళ్లుగా పూణె ఫెస్టివల్ లో భాగంగా ఎడ్ల బండి పోటీలను నిర్వహిస్తున్నారు. జల్లికట్టుతో పాటు ఈ పోటీలను కూడా సుప్రీంకోర్టు నిషేధించింది. అప్పటి నుంచి ఎడ్ల బండి పోటీలను ఆపేశారు. ఇప్పుడు తమిళుల ఆందోళనల నేపథ్యంలో, తమ సంప్రదాయ ఎడ్ల బండి పోటీలను రక్షించుకునేందుకు తాము కూడా ఆందోళనకు దిగుతామని శివసేన హెచ్చిరించింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తర్వాత తమ ఆందోళనను ప్రారంభిస్తామని తెలిపింది.
మరోవైపు, అసోం ప్రజలు కూడా ఆందోళనకు సై అంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వల్ల నిలిచిపోయిన బుల్ బుల్ పిట్టల పోటీల కోసం తాము కూడా ఆందోళన బాట పడతామని అసోం ప్రజలు చెబుతున్నారు. మనం జరుపుకునే సంక్రాంతి సమయంలోనే... అసోం ప్రజలు 'భోగాలి బిహు' పండుగను జరుపుకుంటారు. ఇది కూడా పంటల పండుగే. ఈ సందర్భంగా వారు... మన కోడి పందేల మాదిరి బుల్ బుల్ పిట్టల మధ్య పోటీలు నిర్వహిస్తారు. రెండు పిట్టల కాళ్లకు తాళ్లు కట్టి, వాటికి ఇష్టమైన ఆహారాన్ని ఆశగా చూపి... ఓ టేబుల్ పై పరస్పరం కొట్టుకు చచ్చేలా పోటీ పెడతారు. ఈ పోటీలో ఒక్కోసారి ఒక పిట్ట, అతి తక్కువ సందర్భాల్లో రెండు పిట్టలూ చనిపోతాయి. ఈ పందేలకు అసోంలో చాలా క్రేజ్ ఉంది. జనాలు భారీగా పందెం కాస్తారు. సుప్రీంకోర్టు తీర్పు వల్లే ఈ పందేలు కూడా ఆగిపోయాయి. ఇప్పుడు తమ సంప్రదాయ క్రీడను తాము కూడా బతికించుకుంటామని అసోం ప్రజలు చెబుతున్నారు.