: జల్లికట్టు ఆందోళనకారులపై నిప్పులు చెరిగిన వర్మ... రక్తం తాగే రాబందులంటూ కామెంట్!
ప్రతి అంశంపై స్పందించడం ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఉన్న అలవాటు. తాజాగా ఆయన జల్లికట్టుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో కాకులు, కుక్కలను చూపించడం కూడా నేరమని... అలాంటిది సంప్రదాయం పేరుతో ఎద్దులను రాక్షసంగా హింసించడాన్ని ప్రభుత్వం ఎలా సమర్థిస్తుందని వర్మ ప్రశ్నించారు. జల్లికట్టు సమయంలో ఆ ఎద్దుల కొమ్ములు, చెవులు, తోక విరిగిపోతాయని... ముక్కుకు కట్టిన తాడు వల్ల విపరీతమైన బాధను అనుభవించి మరణిస్తాయని... ఇది అనాగరికమని అన్నారు. అమాయక జీవులను హింసిస్తూ దానికి సంప్రదాయం అనే ముసుగు వేయడం దారుణమని తెలిపారు. అమాయక జంతువులను హింసించే జల్లికట్టు సంప్రదాయం కరెక్ట్ అయితే... అమాయక ప్రజలను హింసించే ఉగ్ర సంస్థ ఆల్ ఖైదా కూడా కరెక్టేనని చెప్పారు.
జల్లికట్టును కోరుతున్న ఒక్కొక్కరిపై 100 ఎద్దులను వదలాలని... అప్పుడు కానీ ఎద్దులు పడుతున్న బాధ ఏంటో వారికి అర్థం కాదని వర్మ అన్నారు. జల్లికట్టు కోసం పోరాడుతున్నవారంతా జంతువులను హింసించే హక్కు కోసం పోరాడుతున్నారని చెప్పారు. జల్లికట్టు కోసం పోరాడుతున్న వారికి సంప్రదాయానికి స్పెల్లింగ్ కూడా తెలవదని ఎద్దేవా చేశారు. జంతువులకు ఓటు హక్కు ఉంటే... ఏ రాజకీయ నేత అయినా జల్లికట్టుకు మద్దతు తెలిపేవాడా? అని ప్రశ్నించారు. 'జల్లికట్టు కోసం ఉద్యమిస్తున్నవారంతా రక్తం మరిగిన మానవ రూపంలో ఉన్న రాబందులు' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.