: నేడు ట్రంప్ ప్రమాణ స్వీకారం.. వణుకుతున్న ఏడు దేశాలు!
డొనాల్డ్ ట్రంప్.. ఈ పేరు వింటే చాలు ఏడు దేశాలు వణికిపోతున్నాయి. ట్రంప్ ప్రభావం తమపై ఎలా ఉంటుందోనని గుబులు చెందుతున్నాయి. అమెరికా 45వ అధ్యక్షుడిగా ట్రంప్ నేడు ప్రమాణ స్వీకారం చేయనుండడంతో అమెరికాతో కలిసి నాటో రక్షణ కూటమిలో ఉన్న బాల్టిక్ దేశాలు కలవరపడుతున్నాయి. ముఖ్యంగా మెక్సికోకు ట్రంప్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న లక్షలాదిమంది మెక్సికన్లను తిరిగి పంపించేస్తానని, అమెరికా, మెక్సికో సరిహద్దులో గోడ కడతానని పలుమార్లు హెచ్చరించిన ట్రంప్ పగ్గాలు చేపట్టాక అనుకున్నంతా చేస్తారేమోనని మెక్సికో ఆందోళన చెందుతోంది.
అమెరికా, చైనాతో సమానమైన ఆర్థిక సంబంధాలు కలిగిన జపాన్ కూడా ట్రంప్‌ను చూసి భయపడుతోంది. చైనాకు సమీపంలో ఉండడంతో తమనెక్కడ ఇరుకున పెడతారోనని ఆందోళన చెందుతోంది. రెండు ఆర్థిక శక్తుల పోరులో తామెక్కడ చిక్కుకుపోతామోనని భయపడుతోంది. ట్రంప్ గెలుపు జర్మనీ, ఫ్రాన్స్‌ను కూడా కలవరపాటుకు గురిచేస్తోంది. రష్యాతో సన్నిహితంగా ఉంటున్న ట్రంప్ యూరప్‌లో జర్మనీ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు మెర్కెల్ వ్యతిరేకులను ఎక్కడ బలోపేతం చేస్తారోనని జర్మనీ వణుకుతుండగా, ఫ్రాన్స్‌లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో మితవాద నేషనల్ ఫ్రంట్ నేత మరైన్లె పెన్‌కు ట్రంప్ మద్దతు ప్రకటిస్తే ఆమె గెలుపు ఖాయమని ప్రత్యర్థులు భయపడుతున్నారు.
అలాగే లాత్వియా, ఎస్టోనియా, లిథువేనియా దేశాలకు కూడా ట్రంప్ భయం పట్టుకుంది. ఇన్నాళ్లు ఇవి నాటో సైనిక కూటమిలో ఉండడంతో ధైర్యంగా ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ రష్యాతో స్నేహం పెంచుకునేందుకు ప్రయత్నిస్తుండడంతోపాటు నాటో కూటమి పని ఇక అయిపోయిందన్న ట్రంప్ వ్యాఖ్యలతో గుబులు చెందుతున్నాయి. మరోవైపు భారత్ పరిస్థితి మాత్రం అయోమయంగా ఉంది. ట్రంప్ వల్ల నష్టమా? లాభమా? అనే విషయాన్ని భారత్ తేల్చుకోలేకపోతోంది.