: నిర్మాతగా మారనున్న బాలకృష్ణ!
ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నిర్మాతగా మారబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. ఈ ఏడాది ఆఖరులో నిర్మాణ సంస్థను ప్రారంభిస్తానని ఆయన తెలిపారు. దర్శకత్వం వహించే అంశంపై ఆయన స్పందిస్తూ, తన ఊహల స్థాయికి ఎవరూ చేరుకోలేరనుకున్నప్పుడు దర్శకత్వం వహిస్తానని చెప్పారు. తనకు ఓ పౌరాణిక సినిమా చేయాలని ఉందని... అయితే అందులో హీరో ఎవరనే విషయాన్ని మాత్రం తాను ఇప్పుడే చెప్పనని ఆయన అన్నారు.
పౌరాణిక సినిమాలు చేసేటప్పుడు ప్రతిభ ముఖ్యం కాదని... ఆహార్యం ముఖ్యమని చెప్పారు. తన ఊహకు తగిన వారు దొరికితే 'నర్తనశాల' సినిమాను నిర్మిస్తానని తెలిపారు. ఆ సినిమాలో ద్రౌపతి పాత్రకు సౌందర్య తప్ప మరెవరూ న్యాయం చేకూర్చలేరని చెప్పారు. దర్శకుడిగా తాను ఎవరితోనైనా నటింపచేయగలనని... అయితే పాత్రలకు తగ్గ నటులు దొరకాలని అన్నారు. 'ఆదిత్య 999' కాన్సెప్ట్ బాగా వచ్చిందని... అయితే కథ ఇంకా సిద్ధం కాలేదని బాలయ్య తెలిపారు. తన కుమారుడు మోక్షజ్ఞతో కలసి నటించాలని ఉందని చెప్పారు. అయితే, తామిద్దరం కలసి నటించగలిగిన సినిమా 'ఆదిత్య' మాత్రమే అని చెప్పారు.