: బీజేపీ కార్యకర్త హత్యతో కేరళలో తీవ్ర ఉద్రిక్తత... జిల్లా బంద్ కు పిలుపు
గుర్తు తెలియని దుండగులు చేసిన దాడిలో ఓ బీజేపీ కార్యకర్త మృతి చెందడంతో కేరళ అట్టుడుకుతోంది. ఈ ఘటన కన్నూరు జిల్లా అండల్లూర్ లో చోటు చేసుకుంది. మృతుడ్ని ఎజుతన్ సంతోష్ (52) గా గుర్తించారు. నిన్న అర్ధరాత్రి సంతోష్ ఇంటిపై దాడి చేసిన దుండగులు అతన్ని చితకబాదారు. ఆ సమయంలో ఆయన భార్య, పిల్లలు ఇంట్లో లేరు. తీవ్రంగా గాయపడ్డ సంతోష్ వెంటనే తన స్నేహితుడికి ఫోన్ చేసి, జరిగిన విషయం గురించి చెప్పాడు. ఆ తర్వాత పోలీసుల సహాయంతో సంతోష్ ను ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ సంతోష్ రక్త స్రావంతో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు. దీంతో, అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ దాడి వెనుక సీపీఎం హస్తం ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ హత్యను ఖండిస్తూ కన్నూరు జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు. అయితే, బీజేపీ నేతలు చేసిన ఆరోపణలను సీపీఎం ఖండించింది. సంతోష్ హత్యతో తమకు సంబంధం లేదని తెలిపింది.