: మీ ఇంట్లో ఫ్రిజ్ ఉందా? కనీసం ఇస్త్రీపెట్టె అయినా ఉందా?.. అయితే మిమ్మల్ని బాదాల్సిందే!.. సామాన్యుల నడ్డి విరిచేందుకు సిద్ధమవుతున్న డిస్కంలు
సామాన్యుల నడ్డి విరిచేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) నడుం బిగించాయి. ఈ మేరకు బుధవారం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)కి ప్రతిపాదనలు సమర్పిస్తూ విద్యుత్ చార్జీలను 3.5 శాతం నుంచి 4 శాతం వరకు పెంచేందుకు అనుమతి కోరాయి. ఆదాయంపై దృష్టి సారించిన డిస్కంలు.. ఎక్కువగా ఉన్నాయని భావించిన వాణిజ్య, పారిశ్రామిక వర్గాల చార్జీలను మాత్రం కొంచెం తగ్గించాలని ప్రతిపాదించగా, నెలవారీ డిమాండ్ చార్జీలను మాత్రం పెంచాలని కోరాయి. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి అధిక విద్యుత్ లోడు కలిగిన వినియోగదారులందరు ఈ భారాన్ని మోయక తప్పని పరిస్థితి నెలకొంది. మరోవైపు విద్యుత్ కొనుగోళ్ల భారం తగ్గించుకునేందుకు మిగిలిన రంగాల వారికి కూడా డిమాండ్ చార్జీని భారీగా పెంచాలని ప్రతిపాదించాయి.
విద్యుత్ వాడినా, వాడకున్నా సామాన్యులను బాదేందుకు సిద్ధమైన డిస్కంలు విద్యుత్ కనెక్షన్ ప్రకారం ఇక నుంచి బిల్లు చెల్లించాల్సిందేనని ప్రతిపాదనల్లో పేర్కొన్నాయి. గృహరంగంలో ఇలా ప్రతిపాదించడం ఇదే మొదటిసారి. కిలోవాట్, అంతకంటే ఎక్కువ విద్యుత్ లోడ్‌తో కనెక్షన్ తీసుకున్న వినియోగదారులకు ఇది భారం కానుంది. అంటే మొత్తంగా ఐదు కిలోవాట్ల లోడు కలిగిన వినియోగదారులు చార్జీల రూపంలోనే నెలకు రూ.275 చెల్లించాల్సి ఉంటుంది. ఇంట్లో మోటార్, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఇస్త్రీపెట్టె ఉన్న గృహ వినియోగదారులకు మోత మోగనుంది. ఇవి కలిగి ఉన్నవారి విద్యుత్ లోడు ఐదు కిలోవాట్ల వరకు ఉంటుంది కాబట్టి ఆ భారం భరించక తప్పదు. అపార్ట్‌మెంట్లలో నివసించే వారైతే ఇంతకంటే ఎక్కువ భారాన్నే మోయాల్సి ఉంటుంది.