: మా దారికి అడ్డు రాకండి.. పచ్చడైపోతారు!: పేటీఎం సీఈఓ శ్రుతి మించిన వ్యాఖ్యలు!
పెద్దనోట్ల రద్దు అనంతరం భారత మొబైల్ కామర్స్ ప్లాట్ ఫాం పేటీఎం సంస్థ లాభాల పంట పండించుకుంది. ఈ నేపథ్యంలో సంస్థ సీఈఓ విజయ్ శంకర్ శర్మ తమ సిబ్బందికి ప్రైవేట్ గా ఒక పార్టీ ఏర్పాటు చేశారు. సంస్థ ఎదుగుదల, సిబ్బంది పనితీరు గురించి ఎంతో ఉత్సాహంగా ఆయన ప్రసంగించారు. అయితే, ఆ ఉత్సాహంలో కొంచెం శ్రుతి మించిన వ్యాఖ్యలు కూడా చేశారట.
తమ దారికి ఎవరైనా అడ్డొస్తే పక్కకు వెళ్లిపోవాలని, లేదంటే చచ్చిపోతారని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, తమ సంస్థ చిన్న సైకిలు లేదా ఆటో లాంటి వాహనం కాదని, యుద్ధ ట్యాంక్ తో సమానమని, తమకు అడ్డొచ్చిన వాటిని యుద్ధ ట్యాంకులాగా పచ్చడి చేసుకుంటూ ముందుకు వెళ్లిపోతామంటూ ఒక రేంజ్ లో ప్రసంగించారు. ఆయన మాట్లాడుతుండగా తీసిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలకు చేరడంతో, అది వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు శర్మ శ్రుతి మించిన వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు కురిపిస్తున్నారు.