: అభిమానులతో పంచుకునేందుకు మంచి శుభవార్త ఇది!: అల్లు అరవింద్
సుదీర్ఘ విరామానంతరం నటించిన ఖైదీ నంబర్ 150వ సినిమా అద్భుతమైన వసూళ్లు సాధించిందని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. హైదరాబాదులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చిరంజీవి అభిమానులతో పంచుకునే మంచి శుభవార్త ఉందని అన్నారు. అదేంటంటే... తెలుగు సినీ చరిత్రలో వేగంగా వంద కోట్ల రూపాయలు వసూళ్లు సాధించిన సినిమాగా ఈ సినిమా నిలిచిందని ఆయన తెలిపారు. ఈమేరకు ఆయన లెక్కలు వివరిస్తూ, మొత్తం 7 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 76,15,04,000 రూపాయలు వసూలు చేసిందని అన్నారు.
తరువాత కర్ణాటక రాష్ట్రంలో 9 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిందని అన్నారు. ఇక, నార్త్ ఇండియాలో కోటీ 43 లక్షల రూపాయలు వసూలు చేసిందని, నార్త్ అమెరికా 17 కోట్ల రూపాయలు వసూలు చేసిందని, వెస్ట్ అమెరికా 3 కోట్ల 90 లక్షల రూపాయల, ఒడిశా 40 లక్షలు, తమిళనాడు 60 లక్షల రూపాయలు వసూలు చేసిందని అన్నారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా తొలి ఏడు రోజుల్లో ఈ సినిమా 108.48 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ఆయన అన్నారు.
దీంతో హయ్యెస్ట్ గ్రాస్ వేగంగా సాధించిన తొలి తెలుగు సినిమాగా ఈ సినిమా రికార్డులకెక్కిందని ఆయన చెప్పారు. ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులందరికీ ఆయన ధన్యవాదాలు చెప్పారు. ఈ విషయాన్ని కుటుంబం తరుపున చెబుతున్నానని ఆయన అన్నారు. వాస్తవానికి ఈ విషయం నిర్మాత వెల్లడించాలని, అయితే త్వరలోనే రామ్ చరణ్ కృతజ్ఞతాభినందన సభ నిర్వహిస్తారని ఆయన తెలిపారు. త్వరలోనే ఆ డేట్ ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.