: మన 'రిపబ్లిక్ డే' వేడుకలకు చీఫ్ గెస్టుగా విచ్చేస్తున్న అబుదాబి రాజు!
మన గణతంత్ర దినోత్సవం జరుపుకునే జనవరి 26... భారతీయులందరికీ ఓ పండుగ రోజు. మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలనే కాదు మన దేశ త్రివిధ దళాలు, ఆయుధ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పే రోజు. ప్రతి గణతంత్ర దినోత్సవానికి ప్రపంచంలోని ఓ ప్రముఖుడిని ముఖ్య అతిథిగా పిలవడం మనకు ఆనవాయతీ. ఇప్పటికే ప్రపంచంలోని ఎంతో మంది అగ్రనేతలు రిపబ్లిక్ డేనాడు మన ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఈసారి అబుదాబి రాజు షేక్ మొహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ చీఫ్ గెస్ట్ గా విచ్చేస్తున్నారు.
వాస్తవానికి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దాదాపుగా పాకిస్థాన్ కు అనుకూలంగానే ఉంటుంది. కానీ, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో మాత్రం గత రెండేళ్లుగా భారత్ కు యూఏఈ మద్దతుగా నిలుస్తోంది. గత ఏడాది ఫిబ్రవరిలో కూడా షేక్ మొహమ్మద్ ఇండియా పర్యటనకు వచ్చారు. ఆయనతో పాటు ఆయన ముగ్గురు సోదరులు, టాప్ కేబినెట్ మినిస్టర్లు భారత్ కు విచ్చేశారు.
2006 తర్వాత గల్ఫ్ దేశానికి చెందిన ఓ నేత మన రిపబ్లిక్ డే ఉత్సవాలకు వస్తుండటం ఇదే తొలిసారి. 2006లో సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా బిన్ అబ్దులాజీజ్ అల్-సౌద్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు.