: ట్రంప్ మాటల ఫలితం... భారీగా నష్టపోయిన యూఎస్ మార్కెట్
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న ట్రంప్, అంతకన్నా ముందే చేస్తున్న వ్యాఖ్యలు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీయడంతో, యూఎస్ మార్కెట్ ఢమాలంది. విదేశీ వాహన కంపెనీల పీచమణుస్తామని, వీసాల విధానాన్ని కఠినం చేస్తామని ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఎస్అండ్ పీ 2.3 శాతం దిగజారింది. గత సంవత్సరం జూన్ 27 తరువాత సూచిక ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి.
ఇదే సమయంలో డౌ జోన్స్ 59 పాయింట్లు, నాస్ డాక్ 0.6 శాతం నష్టపోయాయి. అక్టోబర్ - డిసెంబర్ మధ్య కాలంలో మంచి ఆర్థిక ఫలితాలు నమోదు చేసిన మోర్గాన్ స్టాన్లీ వంటి కంపెనీలు కూడా ఈ సెషన్లో నష్టపోవడం గమనార్హం. కరెన్సీ విషయంలో చైనాతో పోటీ పడలేకపోతున్నామని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇన్వెస్టర్లను అమ్మకాల వైపు నడిపించాయని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానించారు. అమెరికా డాలర్ తో పోలిస్తే, 1998 తరువాత స్టెర్లింగ్ అతిపెద్ద లాభాన్ని నమోదు చేయడం కూడా పతనానికి కారణమైందని వివరించారు.