: మతం మార్చుకునేందుకు అంగీకరించని ప్రియుడిపై యాసిడ్ దాడి చేసిన ప్రియురాలు!


ఇక్కడ సీన్స్ రివర్స్ అయింది. ప్రియుడిపై ప్రియురాలు యాసిడ్ దాడి చేసింది. బెంగళూరులో జరిగిన ఈ సంఘటన సంచలనం రేకెత్తించింది. వివరాల్లోకి వెళ్తే, లిడియా (26), జయకుమార్ (32)లు గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. లిడియా ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో నర్సుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో, పెళ్లి చేసుకుందామంటూ జయకుమార్ పై ఒత్తిడి తెచ్చింది. అంతేకాదు, క్రైస్తవ మతంలోకి మారాలంటూ డిమాండ్ చేసింది. అయితే, పెళ్లికి అంగీకరించిన జయకుమార్ తన మతాన్ని మార్చుకునేందుకు మాత్రం ససేమిరా అన్నాడు. దీంతో వీరిద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. ఈ నేపథ్యంలో, గత నవంబర్ నుంచి లిడియా ఫోన్ కాల్స్ కు కూడా జయకుమార్ స్పందించడం మానేశాడు. దీంతో, ప్రియుడిపై పగ పెంచుకుంది లిడియా. జయకుమార్ ను ఎలాగైలా దెబ్బతీయాలని నిర్ణయించుకుంది.

తన కజిన్ సునీల్ సహాయంతో జయకుమార్ కదలికలపై కన్నేసింది.  జయకుమార్ తన స్నేహితుడితో కలసి పద్మనాభ రాజరాజేశ్వరి ఆలయానికి వెళుతున్నట్టు వీరికి సమాచారం అందింది. దీంతో, వీరిద్దరూ కలసి స్కూటర్ పై వెళ్లి, మార్గమధ్యంలో జయకుమార్ కోసం కాపు కాశారు. దర్శనం అనంతరం కారులో వస్తున్న జయకుమార్ పై దాడి చేశారు. అట్టిగుప్ప బస్ స్టాప్ వద్ద అటకాయించి, జయకుమార్ ముఖంపై లిడియా యాసిడ్ పోసింది. బాధతో కారు నుంచి బయటకు వచ్చిన జయకుమార్ పై బ్లేడుతో దాడి చేసి అక్కడ నుంచి ఉడాయించింది. తీవ్రంగా గాయపడ్డ జయకుమార్ ను అతని స్నేహితుడు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐపీసీ 326ఏ, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, లిడియాను అరెస్ట్ చేశారు. ఆమెకు సహకరించిన సునీల్ మాత్రం పరారీలో ఉన్నాడు. 

  • Loading...

More Telugu News