: సమాజ్ వాదీతో పొత్తు కుదిరితే నేను తప్పుకుంటాను: షీలా దీక్షిత్
ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాజ్ వాదీ పార్టీతో పొత్తు కుదిరితే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని వదులుకుంటానని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ప్రకటించారు. కాగా, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీల పొత్తు ఖాయమైనట్లేనని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ ప్రకటించడంతో ఆమె స్పందించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ, పొత్తు ఖాయమైతే అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రి కావడంలో ఎలాంటి సందేహం అవసరం లేదని, కాంగ్రెస్ పార్టీ తరపున ఆ స్థానానికి ఎంపికైన తాను ఆ స్థానం నుంచి తప్పుకొంటానని అన్నారు. కాగా, ఈ రెండు పార్టీల మధ్య పొత్తు గురించి ఒకట్రెండు రోజుల్లో స్పష్టమైన ప్రకటన వెలువడనుందని రెండు పార్టీలు పేర్కొంటున్నాయి. కాగా, ఇదే సమయంలో రాష్ట్రంలోని ఇతర చిన్న పార్టీలతో కూడా పొత్తు పెట్టుకోవాలని అఖిలేష్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.