: కోహ్లీ సేనకు ఈ సిక్కు చెక్ పెడతాడా?
ఇంగ్లండ్ జట్టుకు స్పిన్నర్ గా విశేష సేవలందించిన భారత సంతతి క్రికెటర్ మాంటీ పనేసర్ ఆస్ట్రేలియా జట్టుకు సేవలందించబోతున్నాడు. భారత్ పర్యటనలో టీమిండియాను ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో ఉన్న ఆసీస్ బోర్డు... దానికి తగ్గ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే పనేసర్ ను ఆసీస్ జట్టుకు సలహాదారుగా నియమించింది. 2012-13 సీజన్ లో భారత్ గడ్డ మీదే భారత్ ను మట్టికరిపించిన టీమ్ లో పనేసన్ సభ్యుడు. ఆ సిరీస్ లో పనేసర్ 17 వికెట్లు తీసి ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఈ నేపథ్యంలో ఇండియా పర్యటనలో పనేసర్ సలహాలు కీలకం కానున్నాయని ఆసీస్ బోర్డు భావిస్తోంది. ఈ వారం రోజుల్లో ఆసీస్ జట్టుతో కలవనున్నాడు పనేసర్. ఆసీస్ స్పిన్నర్లకు సలహాలు ఇవ్వనున్నాడు. ప్రధానంగా లెఫ్టామ్ స్పిన్నర్లయిన స్టీవ్ ఓ కీఫ్, మాట్ రెన్ షాలకు పనేసర్ సలహాలు ఇస్తాడని ఆసీస్ టీమ్ హై పర్ఫామెన్స్ మేనేజర్ హోవార్డ్ తెలిపాడు. స్పిన్ బౌలింగ్ పై పనేసర్ కు మంచి అవగాహన ఉందని ఆయన చెప్పాడు. స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కొనే సమయంలో బ్యాట్స్ మెన్ ఆలోచనా ధోరణి ఎలా ఉంటుంది? ఆ సమయంలో బౌలర్లు ఎలా బౌలింగ్ చేయాలి? అనే విషయాల్లో పనేసర్ సేవలను ఉపయోగించుకుంటామని తెలిపాడు. పనేసర్ ఎంపిక తమకు కలసి వస్తుందనే నమ్మకం ఉందని చెప్పాడు.