: దీపకు వస్తున్న జనాదరణతో శశికళకు షాక్!
జయలలితకు దీర్ఘకాల స్నేహితురాలిగా, ఆమె వారసత్వం తీసుకుని రాష్ట్రానికి సీఎంగా బాధ్యతలు చేపట్టాలని భావిస్తున్న శశికళకు ఇప్పుడు వణుకు పుట్టిస్తోంది జయలలిత రక్త సంబంధీకురాలు దీపా జయకుమార్. తానే అమ్మకు వారసురాలినంటూ ఆమె సవాల్ విసురుతున్నారు. రోజురోజుకూ దీపకు ప్రజల్లో ఆదరణ పెరుగుతూ ఉండటాన్ని శశికళ వర్గీయులు సైతం ఆశ్చర్యంగా చూస్తున్నారు. నేడు ఎంజీఆర్ పుట్టినరోజు వేడుకలతో తమిళనాట అన్నాడీఎంకే రాజకీయాలు 'దీప వర్సెస్ శశికళ' అన్నట్టుగా మారిపోయాయి.
ఇక ఈ ఉదయం మీడియా సమావేశాన్ని నిర్వహించిన దీప తమిళనాడు రాజకీయాలపై ఆచితూచి మాట్లాడారు. తాను రాజకీయాల్లోకి వచ్చానని చెబుతూనే, భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే విషయంలో నిదానంగానే ఉన్న సంకేతాలనిచ్చారు. ముందుగా ప్రజల్లోకి వెళ్లాలన్నది తన అభిమతమని చెప్పకనే చెప్పారు. జయలలిత పుట్టిన రోజైన ఫిబ్రవరి 24 నుంచి తన కార్యాచరణ ప్రారంభమవుతుందని చెప్పారు.
అంతకుముందు ఎంజీఆర్ స్మారక స్థూపం వద్దకు దీప వచ్చినప్పుడు, ఆమెకు మద్దతుగా ప్రజల నుంచి వచ్చిన నినాదాలను శశికళ స్వయంగా విన్నారు. తన వర్గం అన్నాడీఎంకే కార్యకర్తలు పోటీ నినాదాలు చేసినప్పటికీ, దీప వెంట కూడా ఎంతో మంది ఉన్నారన్న విషయం శశికళకు అర్ధమైంది. అధికారం చేతిలో ఉండటంతో, నివాళులు అర్పించే అవకాశం శశికళకు తొలుత దక్కినప్పటికీ, ఆపై అశేష జనసమూహం మధ్యలో చిక్కుకున్న దీపను పోలీసులు అతికష్టం మీద ఎంజీఆర్ సమాధి వద్దకు తీసుకెళ్లగలిగారు. ఈ పరిస్థితులన్నీ శశికళకు మింగుడుపడనివేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తుండగా, దీప తదుపరి తీసుకోబోయే రాజకీయ నిర్ణయాలపై ఆసక్తి నెలకొంది.