: వృద్ధి రేటులో ఇండియాను దాటేసిన చైనా.. నోట్ల రద్దుతో వెనుకబడ్డ భారత్!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత స్థూలజాతీయోత్పత్తి రేటు 7.6 శాతంగా ఉంటుందని గతంలో అంచనా వేసిన ఐఎంఎఫ్, ఇప్పుడు దాన్ని 6.6 శాతానికి పరిమితం చేస్తున్నట్టు వెల్లడించింది. ఇండియాలో నోట్ల రద్దు చూపించిన వ్యతిరేక ప్రభావంతోనే వృద్ధి రేటు కుంటుపడిందని పేర్కొంది. 2016 చివర్లో నగదు లభ్యత క్లిష్టతరం కావడంతో ఈ సంవత్సరం భారత్ కన్నా చైనా వృద్ధి రేటు అధికంగా నమోదు కానుందని తాను విడుదల చేసిన 'వరల్డ్ ఎకనామిక్ ఔట్ లుక్'లో ఐఎంఎఫ్ తెలియజేసింది. ఇండియా పూర్తి స్థాయిలో తిరిగి కోలుకోవడానికి 2018 వరకూ సమయం పట్టవచ్చని అంచనా వేసింది.
ఇక 2016లో చైనా 6.7 శాతం వృద్ధిని సాధించి, ఇండియా కన్నా 0.1 శాతం ముందుంది. ఇటీవలి కాలంలో భారత వృద్ధి రేటు కన్నా చైనా మెరుగైన గణాంకాలను నమోదు చేయడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో ప్రపంచ వృద్ధి రేటు 3.1 శాతంగా ఉందని ఐఎంఎఫ్ పేర్కొంది. 2017-18లో ప్రపంచ వృద్ధి 3.4 శాతం నుంచి 3.6 శాతం మధ్య ఉండవచ్చని వెల్లడించింది. 2017 లో భారత వృద్ధి రేటు గత అంచనా 7.6 శాతాన్ని 0.4 శాతం తగ్గిస్తూ, 7.2 శాతంగా పేర్కొంది. వరల్డ్ బ్యాంకు సహా మిగతా రేటింగ్ సంస్థలు సైతం ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ సంవత్సరం భారత్ లో జీడీపీ తగ్గుతుందని, నోట్ల రద్దుతో ఇండియా వెనుకబడనుందని తేల్చి చెబుతున్నాయి.