: నేడు జయలలిత మేనకోడలు రాజకీయ అరంగేట్రం.. దీప ప్రకటనపై సర్వత్ర ఉత్కంఠ!
తమిళనాట రాజకీయాలు నేటి నుంచి మరింత వేడెక్కనున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీప నేడు తన రాజకీయ అరంగేట్రంపై ప్రకటన చేయనున్నారు. దీంతో ఆమె నుంచి ఎటువంటి ప్రకటన వస్తుందోనని సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. జయ మరణం తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన శశికళకు వ్యతిరేకంగా ఓ వర్గం పార్టీలో ఉండలేక, అలాగని బయటకు వెళ్లలేక సతమతమవుతోంది.
ఇప్పుడు వీరికి దీప ఆశాకిరణంగా కనిపిస్తున్నారు. అమ్మలేని లోటును తీర్చాలంటూ ఆమెపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. టీనగర్‌లోని ఆమె నివాసం ముందు అభిమానులు కిక్కిరిసిపోతున్నారు. రోజూ వేలాదిమంది అభిమానులు ఆమెను కలుసుకుని రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. కొందరైతే సేలం జిల్లాలో దీప పేరుతో పార్టీని స్థాపించడమే కాకుండా సభ్యత్వ నమోదు కూడా చేస్తున్నారు.
ఎంజీఆర్ శత జయంతి ఉత్సవాల రోజైన జనవరి 17న తాను రాజకీయాల్లో అడుగుపెట్టనున్నట్టు దీప ఇదివరకే ప్రకటించారు. అయితే జయ అభిమానుల్లో మరో వర్గం 'జయలలిత, ఎంజీఆర్ అన్నాడీఎంకే' అనే పార్టీ పెడుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇటీవల దీపకు మద్దతుగా నామక్కల్‌లో కొందరు 'అఖిల భారత అమ్మ ద్రవిడ మున్నేట్ర కజగం' (ఏఐఏడీఎంకే) పేరుతో పార్టీని స్థాపించారు. మరోవైపు జయలలిత రాజకీయ సలహాదారు దురై బెంజిమిన్ 'అమ్మ మక్కల్ మున్నేట్ర సంఘం' పేరుతో సోమవారం ఓ పార్టీని స్థాపించి రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. ప్రస్తుతం తమిళనాడులో ఎక్కడ చూసినా 'అమ్మ' జపమే వినిపిస్తోంది. దీంతో ఈరోజు దీప చేయనున్న ప్రకటన గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.