: అమెజాన్‌లో మూడు రోజుల పాటు భారీ డిస్కౌంట్లు
ఆన్లైన్ విక్రయాల సంస్థ అమెజాన్ మరోసారి భారీ డిస్కౌంట్లతో తన కస్టమర్ల ముందుకు వస్తోంది. గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో ఈ నెల 20 అర్ధరాత్రి నుంచి 22వ తేదీ వరకు మూడు రోజుల పాటు దాదాపు 100కు పైగా కేటగిరీల్లో 95 మిలియన్లకు పైగా ఉత్పత్తులను కొనుగోలు చేసుకునేందుకు డిస్కౌంట్లను తీసుకురానున్నట్లు పేర్కొంది. వెనువెంటనే డెలివరీ కూడా ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ ఏడాది తొలిసారిగా ప్రారంభం కానున్న మెగా డిస్కౌంట్ సేల్ ఇదే. ఈ డిస్కౌంట్ లో భాగంగా పాప్యులర్ బ్రాండ్స్‌పై గ్రేట్ డీల్స్ ఉంటాయని పేర్కొంది. స్మార్ట్ఫోన్లు, లాప్టాప్స్, పీసీలు, స్టేషనరీ ప్రొడక్ట్స్, బుక్స్, యాక్ససరీస్ వంటి ఎన్నో వాటిపై డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించనున్నట్లు తెలిపింది.
బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు వెనువెంటనే ఉత్పత్తులను డెలివరీ చేయడం కోసం అమెజాన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది. ఇందుకోసం అమెజాన్ ఇండియాలో తాత్కాలికంగా 7500 పైగా ఉద్యోగాలను సృష్టించనున్నట్టు పేర్కొంది. ప్రధానంగా లాజిస్టిక్స్‌లో ఈ ఉద్యోగాలు అధికంగా ఉండనున్నట్లు తెలిపింది. తాము అందిస్తున్న వేల కొద్దీ ఈ సీజనల్ అవకాశాలు, ఆ అభ్యర్థుల దీర్ఘకాలిక కెరీర్ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం తాత్కాలిక ఉద్యోగుల రిక్రూట్ మెంట్ ప్రక్రియ నడుస్తోందని చెప్పింది. మొదట తీసుకున్న వారికి ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు తెలిపింది.