: నగదు పరిస్థితి గురించి ఆర్‌బీఐ ప్రజలకు అబద్ధాలు చెబుతోంది: ఎస్‌బీఐ మాజీ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) మాజీ ఛైర్మన్ ప్రతీప్ చౌదరి ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద‌నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో ఆర్‌బీఐ దేశంలో న‌గ‌దు ప‌రిస్థితి గురించి ప్రజలకు అస‌త్యాలు చెబుతోందని ఆయ‌న అన్నారు. భార‌త్‌లో ప్ర‌స్తుతం న‌గ‌దు కొర‌త తీవ్రంగా ఉంద‌ని చెప్పారు. పెద్ద‌నోట్ల రద్దు ప్ర‌క్రియలో ఆర్‌బీఐ పారదర్శకంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, వాస్తవాలను దాచిపెడుతూ త‌ప్పించుకోకూడ‌ద‌ని వ్యాఖ్యానించారు.

దేశంలో పేరుకు పోయిన బ్లాక్ మ‌నీని నిర్మూలించ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న ఈ చ‌ర్య సరైంది కాదని ప్రతీప్ చౌదరి అన్నారు. ఈ చ‌ర్య‌ల‌తో నకిలీ నగదును మాత్రమే అరికట్టగ‌ల‌మ‌ని, నల్లధనాన్ని నిరోధించ‌లేమ‌ని వ్యాఖ్యానించారు. దేశంలో నగదు కొర‌త ఇబ్బందులు పోయి సాధారణ స్థితి ఏర్ప‌డడానికి మరో మూడు నెలల స‌మ‌యం పడుతుందని చెప్పారు. దేశంలో ద్రవ్య  వినియోగం దెబ్బతింద‌ని, దీంతో భార‌త‌ ఆర్థిక వ్యవస్థపై శాశ్వత ప్ర‌భావం ప‌డింద‌ని అన్నారు. దేశంలో సరిపడినంత నగదు ఉందని ఆర్‌బీఐ చెబుతున్నదంతా అవాస్త‌వమేన‌ని ఆయ‌న చెప్పారు.

స‌రిప‌డినంత న‌గ‌దు ఉంటే, భార‌త్‌లోని 2 లక్షల ఏటీఎంలలో ఒక్కో దానిలో రూ. కోటి రూపాయలు ఎందుకు ఉంచ‌డం లేద‌ని ప్రతీప్ చౌదరి ప్ర‌శ్నించారు. ప్రతి ఖాతాదారుడు ఏటీఎంల‌లోంచి రూ .5,000 లేదా రూ 10,000 డ్రా చేసుకోవ‌చ్చ‌ని ఎందుకు ప్ర‌క‌టించ‌డం లేద‌ని అన్నారు. బాధ‌లు తీర్చాల్సిన ఆర్‌బీఐ అస‌త్యాలు చెబుతూ పారిపోతోందని ఆయ‌న వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు నిర్ణ‌యంతో ఏర్ప‌డే ప‌రిస్థితుల‌ని అంచనా వేయడంలో, స‌మ‌ర్థ‌వంతంగా చర్యల్ని తీసుకోవడంలో కేంద్ర స‌ర్కారు విఫలమైందని ఆయ‌న ఉద్ఘాటించారు.

  • Loading...

More Telugu News