: నవంబర్ 16న రూ. 70... రెండు నెలలు తిరిగేసరికి రూ. 76కు పెరిగిన పెట్రోల్ ధర... వాహనదారుల తీవ్ర ఆగ్రహం
కేవలం రెండు నెలల వ్యవధిలో పెట్రోలు ధర ఏకంగా ఆరు రూపాయలు పెరగడంపై వాహనదారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ 16న రూ. 70 వద్ద ఉన్న లీటరు పెట్రోలు ధర ఇప్పుడు రూ. 75.91కి చేరింది. ఆరు వారాల సమయంలో నాలుగుసార్లు 'పెట్రో' ధరలను పెంచిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ధరలు తగ్గినప్పుడు పన్ను రేట్లు పెంచి ఆ మేరకు ఆదాను వినియోగదారులకు దక్కకుండా చేసిన ప్రభుత్వ వైఖరిని ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. డిసెంబర్ 1న రూ. 70.58, ఆపై డిసెంబర్ 17న 73.61, జనవరి 1న 75.37, ఇప్పుడు రూ. 75.91కి పెట్రోలు చేరుకుంది. తాజాగా పెరిగిన ధరలతో లీటరు డీజెల్ ధర హైదరాబాద్ లో రూ. 64.34కు చేరింది. తక్షణం పన్నులను తగ్గించి ప్రజలకు ఊరట కల్పించాలన్న డిమాండ్ పెరుగుతోంది.