: అమేజాన్ కు మరోసారి గట్టి వార్నింగ్!
మొన్న హిందూ దేవతల బొమ్మలతో కూడిన డోర్ మేట్స్ .. నిన్న భారత జాతీయ పతాకంతో కూడిన డోర్ మేట్స్ .. ఇప్పుడు గాంధీ బొమ్మలు ముద్రించిన చెప్పులు విక్రయిస్తూ భారత దేశ సౌర్వభౌమత్వాన్ని, గౌరవాన్ని కించపరిచిన ఈ-కామర్స్ దిగ్గజం అమేజాన్ కు మన దేశం తరఫున గట్టి హెచ్చరికలు వెళుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ అమేజాన్ సంస్థకు గట్టి హెచ్చరికలే చేసిన విషయం తెలిసిందే.
తాజాగా కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్ దీనిపై స్పందిస్తూ... అమేజాన్ భారతదేశ గుర్తులు, ఐకాన్స్ పట్ల అలక్ష్యంగా వ్యవహరించరాదన్నారు. భారతీయుల మనోభావాల విషయంలో వివక్ష చూపితే అమేజాన్ తనంతట తానే ప్రమాదం కొనితెచ్చుకున్నట్టు అవుతుందన్నారు. తాను హుందాగా వ్యవహరించాలన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలను తాను ఓ భారతీయ పౌరుడిగానే చేస్తున్నానని ఆయన అన్నారు. ఓ పౌరుడిగా తాను అమేజాన్ తీరు పట్ల ఎంతో కలత చెందానన్నారు.
ఈ వ్యవహారంపై ఇటీవల సుష్మాస్వరాజ్ తక్షణమే వాటి విక్రయాలను నిలిపివేసి భారత్ కు క్షమాపణ చెప్పాలని వార్నింగ్ ఇచ్చారు. మరోసారి ఇలా చేస్తే అమేజాన్ ప్రతినిధులకు వీసాలు కూడా ఇవ్వమని తేల్చిచెప్పారామె. దాంతో అమేజాన్ ఇండియా ప్రతినిధి క్షమాపణలు తెలిపారు. మనదేశంలో అమేజాన్ రెండో అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థగా ఉన్న విషయం తెలిసిందే.