: పాకిస్థాన్ కు చివరకు మిగిలేది 'పంజాబ్' ఒక్కటే!: సైనిక నిపుణుల అంచనా
ఉగ్రవాదులకు మద్దతిస్తూ, పలు జాతులను ఊచకోత కోస్తూ, అంతర్గత సమస్యలను పట్టించుకోకుండా, పక్క దేశాలపై దాడులకు పురిగొల్పుతున్న పాకిస్థాన్, ప్రస్తుతం తన పాలనలో ఉన్న ఎంతో ప్రాంతాన్ని భవిష్యత్తులో కోల్పోనుందని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాక్ దేశంలోని 'పంజాబ్' ప్రాంతం మాత్రమే ఆ దేశం పటంలో మిగులుతుందని, మిగతా ప్రాంతాలన్నీ స్వతంత్ర దేశాలుగా మారుతాయని పదవీ విరమణ చేసిన డిఫెన్స్ ఎక్స్ పర్ట్ మేజర్ జనరల్ పీకే సెహగల్ వ్యాఖ్యానించారు. పాక్ లోని ఎన్నో ప్రాంతాలు స్వాతంత్ర్యం కోసం ఉద్యమిస్తున్నాయని అన్నారు.
"ఇప్పుడు ఫక్తునిస్థాన్ ఉద్యమిస్తోంది. బెలూచిస్తాన్ పోరాడుతోంది. సింధ్ నినదిస్తోంది. గిల్జిత్ - బాల్టిస్థాన్ కూడా అదే దారిలో నడుస్తున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీరులో పరిస్థితి తెలిసిందే. పాక్ పాలకులు వెంటనే స్పందించకుంటే, కేవలం పంజాబ్ ప్రాంతం మాత్రమే మిగులుతుంది. ఆ దేశపు ప్రభుత్వం సైన్యం ప్రమాదాన్ని పసిగట్టడంలో విఫలమవుతోంది" అని ఆయన అన్నారు. పాక్ లో మైనారిటీ ముస్లింలు పాలనకు వ్యతిరేకంగా కదులుతున్నారని గుర్తు చేశారు. పాక్ లో ఒకప్పుడు 22 శాతంగా ఉన్న హిందువులు ఇప్పుడు 2 శాతానికి పరిమితం అయ్యారని, సిక్కులు, క్రిస్టియన్ల సంఖ్యా అంతే ఉందని గుర్తు చేశారు. ఫక్తూన్లు, షియా వర్గం ముస్లింలు ప్రత్యేక దేశం కావాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారని చెప్పారు.
కాగా, రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్ఆర్ సిన్హో సైతం ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పాక్ పాలకులు చాలా పెద్ద తప్పు చేస్తున్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే, దాన్ని భవిష్యత్తులో తిరిగి సరిదిద్దుకోలేరని హెచ్చరించారు.