: పెండింగ్ కేసులపై సుప్రీంకోర్టు చెప్పిన దిగ్భ్రాంతికర వాస్తవాలు!
దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసులపై సుప్రీంకోర్టు నివేదిక దిగ్భ్రాంతికర వాస్తవాలను వెల్లడించింది. 24 హైకోర్టుల్లో 40 లక్షల 54 వేల పెండింగ్ కేసులు ఉన్నాయని సుప్రీంకోర్టు విడుదల చేసిన 2015-16 భారత న్యాయ వ్యవస్థ నివేదిక స్పష్టం చేసింది. వీటిల్లో సుమారు 23 లక్షల సివిల్ కేసులు ఉన్నట్టు వెల్లడించింది. 7.5 లక్షల కేసులు ఏకంగా పదేళ్లకు పైగా పెండింగులో ఉన్నాయని పేర్కొంది. హైకోర్టుల్లో న్యాయమూర్తుల కొరతను కూడా ప్రస్తావించిన అత్యున్నత న్యాయస్థానం, 44 శాతం న్యాయమూర్తుల కొరత దేశ న్యాయ వ్యవస్థను పట్టి పీడిస్తున్నదని వ్యాఖ్యానించింది.
దేశంలోని హైకోర్టుల్లో 1,079 మంది న్యాయమూర్తుల నియామకాలు జరగాల్సి వుండగా, జూన్ 2016 నాటికి 609 మంది మాత్రమే ఉన్నారని పేర్కొంది. ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ హైకోర్టులో ఉండాల్సిన న్యాయమూర్తుల కన్నా 50 శాతానికి పైగా తక్కువ సంఖ్యలో న్యాయమూర్తులు ఉన్నారని తెలిపింది. సిక్కిం, త్రిపుర హైకోర్టుల్లో మాత్రం 100 శాతం న్యాయమూర్తులు ఉన్నారని వెల్లడించింది.