: హెచ్-1బీ వీసాలపై ట్రంప్ రెడ్ కార్డు... ఇక లాటరీ సిస్టమ్ ఉండదు!
అమెరికాలో పని చేసుకునేందుకు విదేశీయులకు వీలును కల్పించే హెచ్-1బీ వీసాల జారీని మరింత కఠినం చేయాల్సిందేనని కాబోయే అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారు. వీసాల జారీకి ప్రస్తుతం వినియోగిస్తున్న లాటరీ పద్ధతిని కూడా ఆపివేయాలని ట్రంప్ టీమ్ సలహా ఇచ్చినట్టు తాజా సమాచారం. వీసా విధానంలో సంస్కరణలు తేవడం ద్వారా, మరింత మంది అమెరికన్లకు ఉపాధిని చూపవచ్చన్నది ట్రంప్ అభిప్రాయం. హెచ్-1బీ వీసాలను అత్యధికంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన తరువాత, ట్రంప్ టవర్లో ఐటీ కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన వేళ, లాటరీ పద్ధతి తొలగింపు, వీసాల జారీ నిబంధనల మార్పులపై ఆయన తన వైఖరిని స్పష్టం చేశారట.
ఐటీ రంగానికి, ముఖ్యంగా బయటి దేశాల నుంచి వచ్చే ఉద్యోగులకు అడ్డుకట్ట వేసేలా ఆయన విధానం ఉండనుందని ట్రంప్ తో సమావేశమైన ఓ ప్రముఖ ఐటీ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఆయన, వీసాల జారీకి లాటరీ సిస్టమ్ వాడరాదని ట్రంప్ విధాన సలహాదారు స్టీఫెన్ మిల్లర్ నుంచి సలహా వచ్చినట్టు తెలిపారు. ఈ వీసాలపై వచ్చే వారు, అత్యధిక వేతనాలను, అది కూడా సగటు అమెరికన్ పొందే వేతనం కన్నా ఎక్కువగా పొందేట్లయితేనే వీసాలు ఇవ్వాలన్నది ట్రంప్ ఆలోచనగా ఉన్నట్టు తెలిపారు.
కాగా, వీసాల సంస్కరణలపై ట్రంప్ నియమించుకోనున్న అటార్నీ జనరల్, సెనెటర్ జెఫర్సన్ సెషన్స్ ఇప్పటికే ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ యూఎస్సీఐఎస్ (యూఎస్ సిజిటన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్) సాలీనా 65 వేల వరకూ వీసాలను సైంటిస్టులు, ఇంజనీర్లు, కంప్యూటర్ ప్రోగ్రామర్లకు ఇస్తూ వస్తుండగా, ఈ సంఖ్యను కూడా తగ్గించాలని ట్రంప్ భావిస్తున్నట్టు సమాచారం. మొత్తం వీసాల్లో 60 శాతం వరకూ భారతీయులకే దక్కుతాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియా నుంచి అమెరికా వెళ్లగోరే ఉద్యోగులకు రానున్నది కష్టకాలమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు.