: నోట్లు రద్దు సమాచారం చెబితే ప్రాణాలకే ముప్పు.. ఆర్టీఐ చట్టం కింద సమాచారం కోరిన సంస్థకు ఆర్బీఐ వింత సమాధానాలు
నోట్ల రద్దు వ్యవహారంపై సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరిన ఓ సంస్థకు ఆర్బీఐ చుక్కలు చూపించింది. ఆ సంస్థకు నేరుగా సమాధానాలు ఇవ్వని రిజర్వు బ్యాంకు ప్రాణాలకు, దేశ భద్రతకు ముప్పు అంటూ కుంటిసాకులు చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నించింది.
నోట్ల రద్దు వ్యవహారంపై నవంబరు 8 నుంచి జనవరి 2 వ తేదీ వరకు జరిగిన ఘటనపై సమాచారం కావాలంటూ ‘బ్లూమ్ బర్గ్ న్యూస్’ ఆర్టీఐ కింద 14 ప్రశ్నలు సంధిస్తూ వాటికి సమాధానాలు కోరారు. దీనికి సమాధానంగా ఆర్బీఐ ఐదు ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చింది. నోట్ల రద్దుపై ఆర్బీఐ బోర్డు ఎప్పుడు నిర్ణయం తీసుకున్నదీ పేర్కొన్న ఆర్బీఐ కమర్షియల్ బ్యాంకుల్లో ఎంతమొత్తం డిపాజిట్ అయిందన్న ప్రశ్నకు తమ వద్ద సమాధానం లేదని పేర్కొంది.
రెండు ప్రశ్నలను మాత్రం నోట్లు ప్రింట్ చేసే ప్రెస్ లకు పంపించింది. నోట్ల రద్దును ఆర్బీఐ ఎందుకు అనుమతించిందన్న ప్రశ్న ఆర్టీఐ కిందికి రాదని తేల్చి చెప్పింది. బ్లూమ్ బర్గ్ న్యూస్ ఒకే ప్రశ్నను మూడుసార్లు అడిగితే మూడింటికి వేర్వేరు సమాధానాలు ఇవ్వడం గమనార్హం. నోట్ల రద్దు నిర్ణయాన్ని ఎంతమంది బోర్డు సభ్యులు ఆమోదించారన్న ప్రశ్నకు ఒకసారి ఏకగ్రీవమని, మరోసారి తమ వద్ద సమాచారం లేదని రకరకాల సమాధానాలు చెప్పింది.
నోట్ల రద్దు నిర్ణయానికి ముందు రద్దయిన నోట్లు బ్యాంకుల్లో ఎన్ని ఉన్నాయన్న ప్రశ్నకు మినహాయింపు ఇవ్వాలంటూ వింత సమాధానం ఇచ్చింది. కొన్ని ప్రశ్నలకు ప్రాణ హాని అని, మరికొన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తే దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆర్బీఐ పేర్కొంది.