: కొత్త తరానికి ఇన్ని అబద్ధాలు చెబుతారా?: 'గౌతమీపుత్ర'పై చరిత్రకారుల నిప్పులు
బాలకృష్ణ నటించిన తాజా చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'పై సీనియర్ చరిత్రకారులు విమర్శలు చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు ప్రశ్నలు సంధించారు. చిత్రంలో కొత్త తరం ప్రజలకు అవాస్తవాలు చెప్పారని ఆరోపించారు శాతకర్ణి అసలు కోటి లింగాలలో జన్మించలేదని, ఆయన తల్లి బాలాశ్రీ వేయించిన శాసనాల్లో ఈ విషయం లేదని స్పష్టం చేశారు. కేవలం దక్కన్ పీఠభూమిని మాత్రమే పాలించిన శాతకర్ణి, దేశమంతటినీ పాలించినట్టు చూపారని అన్నారు.
ఇక శాతకర్ణితో పోలిస్తే 390 సంవత్సరాల తేడాతో క్రీస్తు పూర్వం 312కు చెందిన గ్రీకు రాజు డిమిత్రియస్ తో యుద్ధం చేసినట్టు చూపారని, ఇది చరిత్రను వక్రీకరించడమేనని అన్నారు. శాతకర్ణి తెలంగాణ వ్యక్తి కాదని, మహారాష్ట్రకు చెందిన వ్యక్తని స్పష్టం చేస్తూ, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న సినిమాకు పన్ను రాయితీలు ఇవ్వడం ద్వారా, ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని అన్నారు. వాయిస్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు కెప్టెన్ ఎల్ పాండురంగారెడ్డి, హైదరాబాద్ డక్కెన్ డెమోక్రటిక్ అలయన్స్ అధ్యక్షులు డాక్టర్ కొల్లూరి చిరంజీవి, తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం ప్రతినిధి డీపీ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.