: మేకల మధ్యలో యోగా చేస్తే ఇలా ఉంటుంది!
యోగ చేసే వారు కంఫర్టు గా ఉండే దుస్తులు ధరించి, చక్కటి మ్యాట్ ఒకటి పరచి ప్రశాంత వాతావరణంలో కూర్చుంటారు. ఇటువంటి దృశ్యాలు సాధారణంగా మనం చూస్తుంటాం. అయితే, ఇందుకు భిన్నంగా, యోగా చేసే సమయంలో ‘మే..మే..మే’ అనుకుంటూ మేకలు యోగ సాధకుల దగ్గరకు వెళితే, లేచి మ్యాట్ తో సహా అక్కడి నుంచి మరో చోటుకు వెళ్లిపోవడం ఖాయం. కానీ, అమెరికాలోని ఆల్బెనీ ప్రాంతంలో మాత్రం మేకల మధ్యలోనే యోగా చేస్తుంటారు... ‘నో రిగ్రెట్స్ ఫాం’ పేరుతో ఈ యోగాను కనిపెట్టింది లైనీ మోర్సే.
పదేళ్లుగా తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి మరీ, ఈ యోగాను ఆమె కనిపెట్టింది. ఒరెగాన్ రాష్ట్రంలోని యూనివర్శిటీ క్యాంపస్ లోనూ ఈ యోగా పాఠాలు నేర్పుతోంది. మేకల మధ్యలో యోగా నేర్చుకునేందుకు ఇప్పటికే 900 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారట. ‘గోట్ యోగా’ పేరుతో రూపొందించిన దుస్తులకూ అమెరికా మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందట. ఇంతకీ ఈ యోగా ప్రత్యేకత ఏమిటంటే.. ఓ ఖాళీ మైదానంలో మేకల మధ్య కూర్చుని సాధారణ యోగాసనాలు వేయాలి. మేకలు మధ్య మధ్యలో మన చుట్టూ తిరుగుతూ, మనల్ని తాకుతూ, ఆడుకుంటూ ఉంటాయే తప్పా, ఎటువంటి ఇబ్బంది కల్గించవట. అయితే, మేకల మధ్య యోగా చేయడం వెనుక రహస్యం ఏమిటనేది లైనీ మోర్సేకు మాత్రమే తెలుసు! ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.