: పిల్లాడు కాదు పిడుగు: 14 ఏళ్ల బాలుడితో రూ. 5 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న గుజరాత్ ప్రభుత్వం!
హర్షవర్ధన్ జాలా... వయసు 14 సంవత్సరాలే. కానీ ఒక్కరోజులో దేశవ్యాప్త దృష్టిలోకి వచ్చేశాడు. ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న హర్షవర్ధన్ తో గుజరాత్ ప్రభుత్వం రూ. 5 కోట్ల విలువైన కాంట్రాక్టును కుదుర్చుకోవడమే ఇందుకు కారణం. ఇందుకు సంబంధించిన అవగాహనా ఒప్పందం "వైబ్రెంట్ గుజరాత్" సదస్సు సందర్భంగా జరిగింది.
డ్రోన్ టెక్నాలజీలో అపారమైన ప్రతిభా పాటవాలను సొంతం చేసుకున్న హర్షవర్ధన్, గుజరాత్ ప్రభుత్వానికి మూడు రకాల డ్రోన్ డిజైన్లను తయారు చేసి ఇవ్వనున్నాడు. ఈ మేరకు డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అతనితో ఒప్పందం కుదుర్చుకుంది. రక్షణ రంగంలో హర్షవర్థన్ ఇచ్చే డ్రోన్లను వాడాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. మందుపాతరలను గమనించి, వాటిని డిఫ్యూజ్ చేసే డ్రోన్ డిజైన్లను అంత చిన్న వయసులోనే రూపొందించి అందరి మన్ననలూ పొందుతున్నాడీ యువ కెరటం.
బోర్డు పరీక్షలకు ప్రిపేర్ కావాల్సిన వయసులో రాష్ట్ర ప్రభుత్వంతోనే డీల్ కుదుర్చుకున్నాడు. ఎంతో మంది సైనికులు మందుపాతరలు పేలి మరణిస్తున్నారని టీవీలు చూసి తెలుసుకుని, ఆ పరిస్థితిని నివారించాలన్న ఉద్దేశంతో వీటిని తయారు చేయాలన్న ఆలోచన తనకు వచ్చినట్టు హర్షవర్ధన్ చెబుతున్నాడు. ఇక డ్రోన్ తయారీకి తనకు రూ. 5 లక్షల వరకూ ఖర్చవుతుందని తెలిపాడు.
21 మెగాపిక్సెల్ మెకానికల్ షట్టర్ కెమెరాతో ఉండే డ్రోన్ ఎలా పని చేస్తుందన్న విషయాన్ని ఆ కుర్రాడు చెబుతుంటే, అధికారులు ఆశ్చర్యంతో ఆలకించారు. మందుపాతరను కనిపెట్టిన తరువాత, దానిపై 50 గ్రాముల బరువైన ఓ బాంబును వేయడం ఈ డ్రోన్ ప్రత్యేకత. బాంబు పేలుడుకు మందుపాతర కూడా పేలిపోతుంది. రక్షణ శాఖకు ఈ తరహా డ్రోన్ ఎంతో ఉపయుక్తకరమని, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోనూ వీటిని వాడే ఆలోచన ఉందని అధికారులు తెలిపారు.