: అద్దెకు ఇల్లు కావాలంటూ వచ్చి.. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపిచ్చి, 8 తులాల బంగారం చోరీ
అద్దెకు ఇల్లు కావాలంటూ వచ్చిన దంపతులు ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి బంగారం దోచుకెళ్లిన ఘటన విశాఖపట్టణంలో చోటుచేసుకుంది. స్థానిక మురళీ నగర్ లోని అయ్యప్ప నగర్ లో ఉంటున్న సనపవల ప్రభావతి(55) ఇంటి పక్కనే ఉన్న ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు టులెట్ బోర్డు పెట్టారు. దీనిని చూసిన ఓ జంట ప్రభావతి వద్దకు వచ్చింది. వారికి ఆమె ఇంటిని చూపించారు.
తమకు ఇల్లు నచ్చిందంటూ ప్రభావతితో మాటలు కలిపారు. వెంట తెచ్చుకున్న కూల్ డ్రింక్ ను ఆమెకు ఇచ్చి తాగాలంటూ బలవంతం చేశారు. దానిని తాగిన ప్రభావతి మత్తులోకి జారుకుంది. ఇదే అదునుగా భావించిన దంపతులు ఆమె ఒంటిపై ఉన్న బంగారం గొలుసు, కంకణం తదితర 8 తులాల వస్తువులను దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత కాసేపటికి కోలుకున్న బాధితురాలు జరిగిన ఘోరం తెలుసుకుని లబోదిబోమంది. సాయంత్రం ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.