: ఈ నెలాఖరులోగా సీఎం పీఠాన్ని అధిష్ఠించనున్న శశికళ.. ముహూర్తం ఖరారు చేసిన జ్యోతిష్యులు!


తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆ పార్టీ అధినేత్రి శశికళ పావులు కదుపుతున్నారు. అన్నీ అనుకూలిస్తే ఈనెల 19న కానీ, 27న కానీ ఆమె సీఎం పీఠాన్ని అధిష్ఠిస్తారు. ఈ మేరకు జ్యోతిష్యులు ముహూర్తం ఖరారు చేసినట్టు సమాచారం. జయ మరణం తర్వాత పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో విజయం సాధించిన శశికళ, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని వ్యూహాత్మకంగా చేజిక్కించుకున్నారు. ఈ విషయంలో తనకు ఎదురు లేకుండా చూసుకున్నారు.

పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత దివంగత ముఖ్యమంత్రి జయలలిత లానే కట్టుబొట్టుతో ‘అమ్మ’ను మరిపిస్తున్నారు. దీంతో మొదట్లో ఆమె పట్ల వ్యక్తమైన వ్యతిరేకత క్రమంగా తగ్గింది. మరోవైపు పార్టీ పగ్గాలు అందుకున్న ‘చిన్నమ్మ’ సీఎం పదవిని కూడా చేపట్టాలంటూ కొందరు మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె సీఎం కావడం దాదాపు ఖాయమని పార్టీ వర్గాలు ఢంకా బజాయించి చెబుతున్నాయి. ఈ నెలాఖరులోపే శుభవార్త వింటారని శశికళ అనుకూల మంత్రులు చెబుతున్నారు.

నిజానికి శశికళ గురువారమే సీఎం పదవి చేపట్టాలనుకున్నారు. అయితే మార్గశిర మాసంలో అలా చేయడం మంచిదికాదని కుటుంబ సభ్యులు చెప్పడంతో ఆమె తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. ఈనెల 19 లేదంటే 27న ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఒకవేళ అది కూడా తప్పితే జయ జయంతి లోపు ప్రమాణ స్వీకారం చేయాలని శశికళ నిర్ణయించుకున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News