: నేపాల్లోనూ రూ.2 వేల నోట్లు చెల్లుతాయి.. త్వరలో నోటిఫికేషన్
భారత్‌లో పెద్దనోట్లను రద్దు చేసిన ప్రభుత్వం కొత్తగా రూ.2వేలు, రూ.500 నోట్లను ప్రవేశపెట్టింది. అయితే మన కరెన్సీని విరివిగా ఉపయోగించే మన పొరుగు దేశం నేపాల్‌లో ఇంకా పాత నోట్లే చలామణి అవుతున్నాయి. కొత్తనోట్లను అక్కడ ఇంకా అధికారికంగా చలామణిలోకి తీసుకురాలేదు. ప్రస్తుతం కొత్త నోట్లు అక్కడ చెల్లని నోట్లే. వచ్చేవారం నేపాల్ విదేశాంగ మంత్రి ప్రకాశ్ శరణ్ మహట్ భారత్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రూ.2 వేల నోట్ల చలామణిపై అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయాలని నేపాల్ ప్రభుత్వం భావిస్తోంది. 2015లో రూ.1000, రూ.500 (ప్రస్తుతం రద్దయ్యాయి) నోట్లను లీగల్ టెండర్ చేస్తూ జారీ చేసిన ప్రకటన స్థానంలో కొత్తగా నోటిఫికేషన్ జారీచేయాలని నిర్ణయించింది.
నవంబరు 8న పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం రూ.2 వేల నోటును ప్రవేశపెట్టింది. అయితే నేపాల్ రాష్ట్ర బ్యాంకు(ఎన్ఆర్బీ) ఇప్పటి వరకు వీటి చలామణికి అంగీకరించలేదు. వీటి గురించి నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ ఆర్బీఐని కోరింది. ఈ నేపథ్యంలో ప్రకాశ్ శరణ్ భారత్‌లో పర్యటించనుండడంతో ఈ విషయమై అధికారులతో చర్చలు జరపనున్నారు. ఆర్బీఐ నోటిఫికేషన్ జారీ చేయగానే నేపాల్‌లో కొత్తనోట్లను అంగీకరిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది. కాగా 2015 ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారం భారత్‌ను సందర్శించే నేపాలీలు రూ.25వేల విలువైన రూ.1000, రూ.500 నోట్లు కలిగి ఉండొచ్చు.