: మాటమార్చిన నోబెల్ గ్రహీత.. మనుషుల అక్రమ రవాణాకు రూ.2 వేల నోటు ఊతమిస్తోందన్న కైలాశ్ సత్యార్థి
నోబెల్ బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి మాటమార్చారు. ప్రధాని నోట్లు రద్దు చేస్తూ ప్రకటించిన తర్వాతి రోజు కైలాశ్ మాట్లాడుతూ నోట్ల రద్దుతో పిల్లల అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందని, నోట్ల రద్దు మంచి నిర్ణయమని కొనియాడారు. అయితే రెండు నెలలు తిరిగే సరికి ఆయన మాట మార్చారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.2 వేల నోటు మనుషుల అక్రమ రవాణాకు ఊతమిస్తుందని పేర్కొన్నారు. నోట్ల రద్దుతో మనుషుల అక్రమ రవాణాకు పూర్తిగా అడ్డుకట్ట పడుతుందని తాను భావించానని అయితే అలా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
భోపాల్‌లోని విదిషలో 63వ జన్మదిన వేడుకలు జరుపుకున్న కైలాశ్ మాట్లాడుతూ రూ.2 వేల నోట్లు క్రమంగా హ్యూమన్ ట్రాఫికింగ్‌ను పెంచుతున్నాయన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ సంస్థలు చొరవ తీసుకుని మనుషుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరారు. నల్లధనం, అవినీతి, మనుషుల అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలన్నారు. అస్సాం, పశ్చిమబెంగాల్ నుంచి విదేశాలకు పనిమనుషులను పంపుతున్న ప్లేస్‌మెంట్ సంస్థలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.