: లంచం కేసులో అనుమానితుడిగా శాంసంగ్ వైస్ చైర్మన్.. ప్రశ్నించనున్న ప్రత్యేక దర్యాప్తు బృందం
లంచం కేసులో అనుమానితుడిగా ఉన్న శాంసంగ్ గ్రూప్ చైర్మన్ లీ కున్ హీ కుమారుడు, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ వైస్ చైర్మన్ యాంగ్‌ను ప్రశ్నించాలని నిర్ణయించినట్టు ప్రత్యేక దర్యాప్తు బృందం తెలిపింది. సౌత్ కొరియాకు చెందిన చోయ్ సూన్ సిల్ తనకు అత్యంత ఆప్తుడైన అధ్యక్షుడు పార్క్ జీన్ హేతో ఉన్న సంబంధాలను అడ్డుపెట్టుకుని కొన్ని లాభాపేక్ష లేని కంపెనీలకు భారీ విరాళాలు ఇవ్వాలంటూ ప్రముఖ కంపెనీలపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఆయా సంస్థలను చోయ్ తన వక్తిగత ఏటీఎంలుగా ఉపయోగించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇక ఆ సంస్థలకు పెద్దమొత్తంలో విరాళాలు ఇచ్చింది శాంసంగేనన్నది ప్రధాన అరోపణ. అలాగే చోయ్ కుమార్తెకు కూడా శాంసంగ్ నుంచి మిలియన్ల కొద్దీ యూరోలు ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో విచారణ ప్రారంభించిన ప్రత్యేక దర్యాప్తు బృందం శాంసంగ్ చైర్మన్ లీ, ఇతర అధికారులను ప్రశ్నించారు. తాము డబ్బులు ఇచ్చి, అందుకు ప్రతిఫలంగా ఏమీ కోరలేదని, దానిని లంచంగా ఎలా భావిస్తారంటూ ప్రశ్నించారు. కాగా ఇదే విషయంలో చోయ్‌తో అధ్యక్షుడు జీన్ కుమ్మక్కయ్యారన్న ఆరోపణలతో ఆయనను అభిశంసించిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంలో అనుమానితుడిగా పరిగణిస్తున్న శాంసంగ్ వారసుడు అయిన యాంగ్‌ను ప్రశ్నించనున్నట్టు ప్రత్యేక దర్యాప్తు అధికారుల బృందం ప్రతినిధి లీ క్యూ చుల్ తెలిపారు.