: ‘మెక్ డొనాల్డ్’ మెనూలో మసాలా దోశ బర్గర్లు, అండా బుర్జీ!
‘మెక్ డొనాల్డ్స్’ మెనూలో ఇకపై మసాలా దోశ బర్గర్లు, మొలాగా పోడి సాస్, అండా బుర్జీ... లాంటి స్వదేశీ బ్రేక్ ఫాస్టు చేరనుంది. ముంబైలోని మెక్ డొనాల్డ్స్ అవుట్ లెట్స్ లో ఈ వంటకాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఇంతకాలం, పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ప్రైస్ పేరిట పలు విదేశీ రుచులను అందిస్తున్న ఈ సంస్థ, స్వదేశీ రుచులను గ్రిల్డ్ పద్ధతిలో అందిస్తామని చెబుతోంది.
కాగా, మన దేశంలోని 240 మెక్ డొనాల్డ్ అవుట్ లెట్లను నిర్వహిస్తున్న వెస్ట్ లైఫ్ డెవలప్ మెంట్ సంస్థ వైస్ చైర్మన్ అమిత్ జతియా మాట్లాడుతూ, ముంబైలోని 44 మెక్ డొనాల్డ్ అవుట్ లెట్స్ లో ఈ నెల 13 నుంచి ఈ మెనూను అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ ఐటమ్స్ రూ.30 నుంచి రూ.135 వరకు ధరలలో లభిస్తాయని, త్వరలోనే దేశ వ్యాప్తంగా ఉన్న మెక్ డొనాల్డ్ అవుట్ లెట్స్ లో ఈ మెనూను ప్రవేశపెడతామని అన్నారు. ఎక్కువ మంది వినియోగదారులు బ్రేక్ ఫాస్ట్ సెగ్మెంటులోకి వస్తున్నారని, అందువల్ల ఈ మార్కెట్ మరింతగా విస్తరించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.