: వ్యవస్థనే నాశనం చేసేసిన మోదీ: రాహుల్ గాంధీ నిప్పులు
అధికారం ఉంది కదాని ప్రధాని నరేంద్ర మోదీ, భారత వ్యవస్థనే నాశనం చేశారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. కాంగ్రస్ ఆధ్వర్యంలో జరిగిన జన్ వేదన సమ్మేళన్ లో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నేతలు పలువురు హాజరయ్యారు. కాంగ్రెస్ పాలనలోనే 'అచ్చే దిన్' కనిపించిందని అన్నారు. తమ పార్టీ ప్రజల కోసం ఎన్నో త్యాగాలను చేసిందని తెలిపారు. ప్రజలంతా మోదీని నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రజలను ఇన్ని ఇబ్బందులకు ఎందుకు గురి చేశారని రాహుల్ ప్రధానిని ప్రశ్నించారు.
తాము అడుగుతున్న ప్రశ్నలకు ఆయన్నుంచి సమాధానం రావడం లేదని, ప్రజలే అడగాలని తెలిపారు. ప్రజలను కష్టాల్లోకి నెట్టిన మోదీ, తమాషా చూస్తున్నారని విమర్శించారు. నోట్లను రద్దు చేయాలన్నది మోదీ వ్యక్తిగత నిర్ణయమేనని, దాని వల్ల వచ్చే కష్టాలను ముందుగా తెలుసుకోకుండా, కనీసం సరిపడినంత నోట్లను సిద్ధం చేసుకోకుండా హడావుడిగా నిర్ణయం ప్రకటించారని ఆరోపించారు. మోదీ వైఖరితో వృద్ధి రేటు గణనీయంగా తగ్గిందని అన్నారు. ఆయన ఆలోచనలకు ఆర్బీఐ సైతం ముందూ వెనుకా చూడకుండా వంత పాడిందని రాహుల్ విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కాగా, ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ మంత్రులు చిదంబరం, ఏకే ఆంటోనీ ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు.