: బుర్ఖాలను నిషేధించిన మరో దేశం!
ముస్లిం మహిళలు ధరించే బుర్ఖాలను ఆఫ్రికా దేశం మొరాకోలో నిషేధించినట్టు వార్తలు వెలువడుతున్నాయి. అయితే, అన్ని రకాల బుర్ఖాలను కాకుండా... ముఖం మొత్తాన్ని కప్పి ఉంచే బుర్ఖాలపై మాత్రమే ఈ నిషేధం ఉండబోతోంది. భద్రతా కారణాల రీత్యానే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నట్టు చెబుతున్నారు. అయితే, దీనికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. వారం రోజుల్లో దీనికి సంబంధించి ఆ దేశ హోంమంత్రిత్వ శాఖ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. బుర్ఖాల తయారీ, అమ్మకాలు, ఎగుమతులు, దిగుమతులు అన్నింటినీ పూర్తిగా నిషేధిస్తున్నట్టు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపినట్టు లీ360 అనే ఓ వార్తా వెబ్ సైట్ వెల్లడించింది. బందిపోట్లు బుర్ఖాలను ధరించి దోపిడీలకు, నేరాలకు పాల్పడుతున్నారని... అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు వెబ్ సైట్ తన కథనంలో పేర్కొంది. ఇప్పటికే కొన్ని దేశాలు బుర్ఖాపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.