: పవన్ ఇంట్రావర్ట్...రాంగోపాల్ వర్మ ట్రిక్కీ పర్సన్: చిరంజీవి
పవన్ కల్యాణ్ చిన్నప్పటి నుంచి ఇంట్రావర్ట్ అని చిరంజీవి తెలిపారు. వాడెప్పుడూ పెద్దగా మాట్లాడలేదని ఆయన అన్నారు. చరణ్ వాళ్ల బాబాయిని ఎప్పుడంటే అప్పుడు కలుస్తాడని చిరంజీవి చెప్పారు. రాంగోపాల్ వర్మ ట్రిక్కీ పర్సన్ అని చిరంజీవి అభిప్రాయపడ్డారు. ఒకే ఇంట్లో ఒకరిని తిడతాడు, మరొకరిని పొగుడుతాడని ఆయన అన్నారు. రాంగోపాల్ వర్మ గురించి మాట్లాడడం వేస్టు అని ఆయన చెప్పారు. ఆయనదొక సైకాలజీ అని, ఒకరిని పొగిడి మరొకర్ని తెగడడం కుత్సిత బుద్ధిని చూపిస్తుందని ఆయన అన్నారు. ఆయన మేధావితనం పెట్టి మంచి మంచి సినిమాలు చేయాలని ఆయన సూచించారు. పవన్ ను కూడా చాలా సార్లు కించపరిచాడని ఆయన తెలిపారు.
నాగబాబుతో కూర్చుంటే తనకు టైం తెలియదని, కల్యాణ్ మాత్రం తనతో కూర్చుని మాట్లాడలేడని ఆయన చెప్పారు. నాగబాబు ఎన్నో విషయాలు చెబుతాడని, వాడితో టైం స్పెండ్ చేయడం చాలా బాగుంటుందని ఆయన అన్నారు. కళ్యాణ్ తనతో కంటే వాళ్ల వదినతోనే ఎక్కువ మాట్లాడుతాడని ఆయన చెప్పారు. పూరీ జగన్నాథ్ మంచి కథ చెప్పాడని, ఆ కథకు మార్పులు చెప్పానని, అవి చేసి వస్తాడనే ఆశిస్తున్నానని చిరంజీవి తెలిపారు. జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా తన ఫేవరేట్ సినిమా అని చిరంజీవి చెప్పారు. మంచి దర్శకుల్లో విశ్వనాథ్, బాలచందర్, బాపులు, అందంగా చూపాలంటే రాఘవేంద్రరావు, డ్రామా పండించాలంటే కోదండరామిరెడ్డి వంటి ఎందరో దర్శకులు ఉన్నారని ఆయన చెప్పారు.