: ఇలాంటి నిర్ణయాలు మంచివి కావు: ఆస్ట్రేలియా బోర్డుపై విమర్శలు గుప్పించిన వార్నర్
క్రికెట్ ఆస్ట్రేలియా (ఆసీస్ బోర్డు) తీసుకుంటున్న నిర్ణయాలు జట్టుకు ఏ మాత్రం మేలు చేయవని ఆ దేశ స్టార్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ విమర్శలు గుప్పించాడు. ఓవైపు టెస్ట్ సిరీస్ కోసం తామంతా ఇండియాకు వెళుతుంటే... అదే సమయంలో టీ20 సిరీస్ ఆడటం కోసం శ్రీలంక జట్టును ఆస్ట్రేలియాకు ఆహ్వానించడం మూర్ఖత్వం అవుతుందని అన్నాడు. ఒక అత్యుత్తమ జట్టును తయారు చేయాలనుకున్నప్పుడు ఒకేసారి రెండు సిరీస్ లకు సిద్ధం కావడంలో అర్థంలేదని చెప్పాడు.
తనతో పాటు స్మిత్, షాన్ మార్ష్, స్టార్క్ లతో పాటు మరికొందరు ఈ ఏడాది జరిగిన వరల్డ్ టీ20లో ఉన్నామని... ఇప్పుడు ఆస్ట్రేలియాలో జరిగే టీ20 సిరీస్ కు తామంతా దూరమవుతామని వార్నర్ అసహనం వ్యక్తం చేశాడు. తామంతా టీ20 క్రికెట్ ఆడకపోతే... తదుపరి ఆస్ట్రేలియాలో జరిగే వరల్డ్ కప్ కు ఎలా సన్నద్ధమవుతామని ప్రశ్నించాడు. ఇది కచ్చితంగా మంచి నిర్ణయం కాదని వార్నర్ స్పష్టం చేశాడు.